Telugu Global
Telangana

నేడు చేవెళ్లలో కేసీఆర్ సమర శంఖారావం..

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండు లేదా మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రపై కూడా చర్చ జరుగుతోంది.

నేడు చేవెళ్లలో కేసీఆర్ సమర శంఖారావం..
X

లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. వరంగల్ లాంఛనం కూడా పూర్తి కావడంతో అభ్యర్థుల ప్రకటన పరిపూర్ణమైంది. ఇప్పటికే సమీక్షలు, సమావేశాల పేరుతో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ప్రచార రథాలు కూడా జనంలోకి వచ్చాయి. ఇక కేసీఆర్ ఈరోజు నుంచి లోక్ సభ ఎన్నికల సమర శంఖం పూరించబోతున్నారు. నేడు చేవెళ్లలో జరగబోయే మొదటి ఎన్నికల బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది.

ప్రజా ఆశీర్వాద సభ పేరిట నిర్వహిస్తున్న ఈ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ సహా ఇతర కీలక నేతలు పాల్గొంటారు. చేవెళ్ల లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌కు భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిస్తారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నల్లగొండ, కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించింది. అయితే ఆ రెండు సభల్లో పూర్తిగా రైతాంగ సమస్యలపైనే ఫోకస్ చేశారు నేతలు. నేడు చేవెళ్లలో జరిగే బహిరంగ సభ లోక్ సభ ఎన్నికలకు సమర శంఖారావం అని చెబుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండు లేదా మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. దానికి బదులు కేసీఆర్ బస్సు యాత్రపై కూడా చర్చ జరుగుతోంది. రెండిటిలో ఏది ఖాయం అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మే-13న ఎన్నికలు జరుగుతాయి. దాదాపు 20 రోజుల పాటు తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలు జోరుగా సాగుతాయి.

First Published:  13 April 2024 1:46 AM GMT
Next Story