Telugu Global
Telangana

ఇవాళే ఆఖరు.. పెండింగ్ చలాన్లు కట్టేశారా..?

పోలీసుల రికార్డుల ప్రకారం డిసెంబర్ 25 నాటికి రాష్ట్రంలో 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. ఈ 15 రోజుల వ్యవధిలో దాదాపు రూ.100.5 కోట్లు ఖజానాకు జమయ్యాయి.

ఇవాళే ఆఖరు.. పెండింగ్ చలాన్లు కట్టేశారా..?
X

పెండింగ్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రాయితీకి ఇవాళే చివరి రోజు. డిసెంబర్‌ 26న ట్రాఫిక్‌ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పెండింగ్‌ చలాన్ల చెల్లింపు గడువు ఇవాల్టితో ముగియనుంది. దీంతో ఇప్పటివరకు చలాన్లు చెల్లించని వారు ఇప్పటికైనా చెల్లించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరుతున్నారు. అవకాశం ఉన్నప్పుడే త్వరపడాలని సూచిస్తున్నారు.

ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్‌ చలాన్లపై 90 శాతం రాయితీ ప్రకటించగా.. టూ వీలర్స్‌కు 80 శాతం, ఫోర్‌ వీలర్స్, ఆటోలకు 60 శాతం, లారీలు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం డిస్కౌంట్ సౌకర్యం కల్పించారు. డిసెంబర్‌ 25 వరకు పెండింగ్‌లో ఉన్న చలాన్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. తర్వాత పడిన చలాన్లకు రాయితీ వర్తించదు.

పోలీసుల రికార్డుల ప్రకారం డిసెంబర్ 25 నాటికి రాష్ట్రంలో 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. ఈ 15 రోజుల వ్యవధిలో దాదాపు రూ.100.5 కోట్లు ఖజానాకు జమయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25.67 కోట్లు వసూలయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.19.02 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.11.06 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకూ కేవలం 31.75 శాతం మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇవాల్టితో రాయితీ గడువు ముగియనుండడంతో ఆఖరి రోజు పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. చలాన్లపై డిస్కౌంట్‌ కార్యక్రమానికి గడువు పొడిగిస్తారా.. లేదా ఇవాల్టితో ముగిస్తారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  10 Jan 2024 10:29 AM IST
Next Story