నామినేషన్లకు ఇవాళే ఆఖరు.. కామారెడ్డికి రేవంత్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఆర్డీవో ఆఫీసు వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేస్తారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరుకుంది. ఈనెల 3న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం గడువు ముగిసే సమయానికి 119 నియోజకవర్గాల్లో దాదాపు 1,188 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది.
గురువారం మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురువారమే నామినేషన్లు దాఖలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున రావడంతో నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు సందడిగా మారాయి. ఇక చివరి రోజు కావడంతో ఇవాళ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలవుతాయని అంచనా.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఆర్డీవో ఆఫీసు వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేస్తారు. ఈసారి కొడంగల్‌తో పాటు కామారెడ్డిలోనూ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నామినేషన్ తర్వాత కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈనెల 6న కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి.
నవంబర్ 13న నామినేషన్లను పరిశీలన జరగనుంది. నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక నవంబర్ 30న తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే రోజు పోలింగ్ జరగనుంది.