Telugu Global
Telangana

బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల రాజీనామా.. సీఎం కేసీఆర్‌కు లేఖ పంపిన మాజీ మంత్రి

బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు తుమ్మల నాగేశ్వరరావు లేఖ పంపించారు.

బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల రాజీనామా.. సీఎం కేసీఆర్‌కు లేఖ పంపిన మాజీ మంత్రి
X

మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో ఆయన పార్టీలో చేరడం ఖరారయ్యింది. దీంతో తాజాగా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు లేఖ పంపించారు.

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గొల్లగూడెంలో జన్మించిన తుమ్మల నాగేశ్వరరావు 1982లో తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 1983లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1985లో తొలి సారి సత్తుపల్లి నుంచి గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999లో టీడీపీ సత్తుపల్లికి ప్రాతినిథ్యం వహించారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

2014లో ఖమ్మం నుంచే పోటీ చేసి తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున గెలిచారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తుమ్మల ఓడిపోయారు. అప్పటి నుంచి బీఆర్ఎస్‌కు దూరంగానే ఉంటూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారని తుమ్మల భావించారు. కానీ సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో.. తుమ్మలకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు.




First Published:  16 Sept 2023 11:08 AM IST
Next Story