Telugu Global
Telangana

3 రోజులు.. 3 పులులు మృతి.. కాగజ్‌నగర్‌ అడవుల్లో కలకలం

మొదట పులుల మధ్య పోరాటం జరగడం వల్లే తీవ్ర గాయాల పాలై చనిపోయినట్లు అధికారులు భావించారు. తర్వాత పులుల మృతిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

3 రోజులు.. 3 పులులు మృతి.. కాగజ్‌నగర్‌ అడవుల్లో కలకలం
X

కొమ‌రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌లో పులుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో మూడు పులులు మరణించడంపై ఆందోళన‌ వ్యక్తమవుతోంది. శనివారం రాత్రి కాగజ్‌నగర్‌కు సమీపంలోని దరిగాం అటవీప్రాంతంలో ఎస్‌-15 అనే రెండేళ్ల వయసున్న పులి.. సోమవారం ఎస్‌-9 అనే ఆరేళ్ల పులి మృతిచెంది ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తాజాగా మరో మగ పులి కళేబరాన్ని స్థానిక వాగు సమీపంలో ఫారెస్టు అధికారులు గుర్తించారు.


మొదట పులుల మధ్య పోరాటం జరగడం వల్లే తీవ్ర గాయాల పాలై చనిపోయినట్లు అధికారులు భావించారు. తర్వాత పులుల మృతిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన ఓ పులిపై విష ప్రయోగం జరిగినట్లు ధృవీకరించారు. ఆరేళ్ల ఎస్-9 అనే పులి పాయిజన్ కారణంగానే చనిపోయినట్లు బయటపడింది. పాయిజన్‌ ఎక్కించిన పశువు కళేబరాన్ని తినడంతోనే పులి చనిపోయినట్లుగా ఫారెస్టు అధికారులు చెప్తున్నారు. ఇక రెండో పులి మెడలో ఉచ్చును సైతం గుర్తించారు అధికారులు. శాంపిల్స్ ఫొరెన్సిక్‌ ల్యాబ్స్‌కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్టులో వచ్చిన రిజల్ట్స్‌ను బట్టి పులుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కాగజ్‌నగర్ అడవుల్లో సంచరిస్తున్న మరో రెండు పులుల జాడ తెలియాల్సి ఉంది. పులుల కదలికలను ట్రాకింగ్ చేయడంలో ఫారెస్టు అధికారులు పూర్తిగా ఫెయిల్‌ అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆసిఫాబాద్‌ జిల్లాలోని కడంబా ప్రాంతంలో బల్లార్షా-చంద్రాపూర్‌-అహిరి అడవులు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతం పులుల ఆవాసానికి అనుకూలంగా ఉంటుంది. ఆసిఫాబాద్ అట‌వీ ప్రాంతంలోని వాతావరణం పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో మహారాష్ట్ర నుంచి ఆడ పులులు గర్భం దాల్చడానికి ఇక్క‌డ‌కు వస్తుంటాయి. గత ఎనిమిది నెలల్లో ఆసిఫాబాద్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లోని బల్లార్షా-చంద్రాపూర్‌-అహిరి అడవుల్లో తొమ్మిది పెద్దపులులు ఇదే తరహాలో చనిపోయాయి. చనిపోయి వాటిలో ఎక్కువగా ఆడ పులులే.

First Published:  9 Jan 2024 6:43 PM IST
Next Story