Telugu Global
Telangana

బీఆర్ఎస్ పేరుతో మూడు పార్టీలు.. టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడులో పోటీ

బీఆర్ఎస్ పేరుతో మూడు పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి బహుజన్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ముంబై నుంచి బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ (బీఆర్ఎస్), జైపూర్ నుంచి భారతీయ రాష్ట్ర సమానతవాద పార్టీ (బీఆర్ఎస్)లు ఇప్పటికే ఈసీఐ వద్ద నమోదు అయ్యాయి.

బీఆర్ఎస్ పేరుతో మూడు పార్టీలు.. టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడులో పోటీ
X

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పేరుతోనే బరిలోకి దిగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా రోజు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సదరు తీర్మాన పత్రాన్ని తీసుకొని పార్టీ సీనియర్ నేత బి. వినోద్ కుమార్ బృందం ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)ని కలవడానికి వెళ్లింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాలని కోరింది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అనే అబ్రివేషన్ (సంక్షిప్త నామం)తో మూడు పార్టీలు రిజిస్టర్ అయినట్లు ఈసీ తెలిపింది. కాబట్టి పేరును వెంటనే మార్చడం కుదరదని.. కనీసం నెల రోజుల సమయం పడుతుందని తెలిపింది. దీంతో మునుగోడులో పాత పేరుతోనే పోటీ చేయాలని నిర్ణయించారు.

బీఆర్ఎస్ పేరుతో మూడు పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి బహుజన్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ముంబై నుంచి బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ (బీఆర్ఎస్), జైపూర్ నుంచి భారతీయ రాష్ట్ర సమానతవాద పార్టీ (బీఆర్ఎస్)లు ఇప్పటికే ఈసీఐ వద్ద నమోదు అయ్యాయి. ఈ పార్టీలు రిజిస్ట్రేషన్ అయినా ఇప్పటి వరకు రాష్ట్ర లేదా జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందలేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్‌గా మార్చడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ కొన్ని లీగల్ ప్రొసీజర్స్‌ను ఫాలో కావల్సి ఉంటుంది. ఇందుకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఈసీ తెలిపింది. అయితే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు (అక్టోబర్ 7) నుంచే ప్రారంభం అవుతుంది. పేరు మార్పునకు ఈసీ అప్రూవల్ రానందునే టీఆర్ఎస్ పేరుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ సీనియర్ లీడర్ బి. వినోద్ కుమార్ గురువారం ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మను కలిశారు. టీఆర్ఎస్ తీర్మాన కాపీని, జనరల్ బాడీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు అందించారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పేరు మార్చాలంటూ రాసిన లేఖను కూడా ఇచ్చారు. అయితే, ఇప్పటికే మూడు పార్టీల సంక్షిప్త నామం బీఆర్ఎస్‌గా ఉండటంతో వెంటనే మార్చడం కుదరదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వినోద్.. ఈసీ అధికారులు తమ తీర్మాన కాపీని తీసుకున్నారు. అప్లికేషన్‌ను నిశితంగా పరిశీలించారు. కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఫాలో కావల్సి ఉంటుందని తెలిపారు. భారత్ రాష్ట్ర సమితి పేరుతో దేశంలో ఏ పార్టీ లేదు. కేవలం బీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం మాత్రమే ఉన్నది. అది పెద్ద అడ్డంకి కాబోదు అని స్పష్టం చేశారు.

ఒక పార్టీ పేరు మార్చాలంటే ముందుగా జనరల్ బాడీ మీటింగ్‌లో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మాన కాపీతో పాటు పేరు మార్చే దరఖాస్తును ఈసీఐకి 30 రోజుల్లోగా సబ్మిట్ చేయాలి. అంతే కాకుండా సదరు పార్టీ పేరు మారుస్తున్నట్లు కనీసం రెండు జాతీయ, రెండు లోకల్ పేపర్లలో నోటీసును పబ్లిష్ చేయాలి. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా ఈసీకి తెలియజేయాలి. ఆ తర్వాత ఈసీ పేరు మార్పునకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

First Published:  7 Oct 2022 2:45 AM GMT
Next Story