Telugu Global
Telangana

టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టు.. 80 మందికి అందిన ఏఈ ప్రశ్నపత్రం

నల్గొండకు చెందిన విక్రమ్, దివ్య డీఏఓ పేపర్ కొనగా.. రవికిషోర్ అనే వ్యక్తి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేయడంతో అరెస్టు చేశారు.

టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టు.. 80 మందికి అందిన ఏఈ ప్రశ్నపత్రం
X

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నియామకాల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ బృందం తాజాగా ముగ్గురిని అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 39కి చేరింది. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులను మరో సారి కస్టడీకి తీసుకొని పోలీసులు విచారించగా.. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష ప్రశ్నపత్రాలు కొన్న వారి వివరాలు బయటకు వచ్చాయి.

నల్గొండకు చెందిన విక్రమ్, దివ్య డీఏఓ పేపర్ కొనగా.. రవికిషోర్ అనే వ్యక్తి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేయడంతో అరెస్టు చేశారు. విక్రమ్, దివ్య అన్నాచెల్లెల్లు కావడం గమనార్హం. ఇక రవికిషోర్ అనే వ్యక్తి స్వయంగా పేపర్ కొనుగోలు చేయడమే కాకుండా.. మరో 80 మందికి విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రవికిషోర్‌ను కస్టడీలోకి తీసుకొని ఏఈ ప్రశ్నపత్రం కొనుక్కున్న 80 మంది వివరాలు రాబట్టాలని సిట్ భావిస్తోంది. భవిష్యత్‌లో వారిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ బృందానికి రోజుకో విషయం తెలుస్తున్నది. నిందితులను లోతుగా విచారించే కొద్దీ.. ప్రశ్నపత్రాలు ఎంత మందికి విక్రయించారనే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రశ్నపత్రాలు ముఖ్యంగా ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ద్వారానే బయటకు వెళ్లాయి. వారి నుంచి రేణుక రాథోడ్‌కు అందాయి. కాగా.. ప్రవీణ్, రేణుకలే ప్రశ్నపత్రాలను అమ్మినట్లు సిట్ పోలీసులు చెబుతున్నారు. చాలా మంది ఆస్తులు తాకట్టు పెట్టిమరీ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారు. మంచి జాబ్ వస్తుందని విదేశాల్లో ఉన్న వారు కూడా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి.. హైదరాబాద్ వచ్చి పరీక్ష రాసి వెళ్లినట్లు తెలుస్తున్నది.

నేడు హైకోర్టులో గ్రూప్-1 పరీక్షపై విచారణ..

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరుగనున్నది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిరుడు అక్టోబర్‌లో నిర్వహించగా.. లీకేజీ వ్యవహారంతో దాన్ని రద్దు చేశారు. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ జూన్ 11న నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు నెలల పాటు పరీక్షను వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరగా.. మే 25న విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది.

First Published:  25 May 2023 7:45 AM IST
Next Story