అరెస్ట్ నంబర్ 99: పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు
ప్రవీణ్ కు బంధువులైన ఈ ముగ్గురూ సహకరించిన తీరుపై సిట్ తగిన ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. పక్కాగా సమాచారాన్ని ఖరారు చేసుకున్నాకే వీళ్లను కటకటాల వెనక్కు పంపించి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు కొనసాగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి లింకులున్నట్టుగా అనుమానిస్తూ మరో ముగ్గురిని సిట్ అరెస్ట్ చేసింది. వీరిని ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు బంధువులుగా గుర్తించి అదుపులోకి తీసుకుంది.
తాజాగా అరెస్ట్ చేసిన ముగ్గురితో.. పేపర్ లీకేజ్ కేసుకు సంబంధించి సిట్ సంకెళ్లు వేసిన వారి సంఖ్య 99కు చేరింది. పేపర్లను పరీక్షకు ముందే బయటికి వెళ్లేలా చేసిన స్కామ్ లో.. ప్రవీణ్ కు బంధువులైన ఈ ముగ్గురూ సహకరించిన తీరుపై సిట్ తగిన ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. పక్కాగా సమాచారాన్ని ఖరారు చేసుకున్నాకే వీళ్లను కటకటాల వెనక్కు పంపించి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం.
ఇక.. ఈ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డికి మరోసారి కోర్టులో భంగపాటు ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే మూడు సార్లు రాజశేఖర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి కాగా.. నాలుగోసారి కూడా ఆయనకు చుక్కెదురైంది.
గత ఏడాది టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాలు లీక్ అయిన ఘటనకు సంబంధించి సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియామక పరీక్షలను సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. తర్వాత పూర్తి భద్రతా ఏర్పాట్లతో వాటిని రీ షెడ్యూల్ చేసి నిర్వహించాల్సి వచ్చింది. ఇంతటి ప్రభావాన్ని కలగజేసిన ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇంకెంతమంది అరెస్ట్ అవుతారు.. విచారణ తీరు ఎలాంటి మలుపులు తిరగనుందన్నది ఉత్కంఠను పెంచుతోంది.