Telugu Global
Telangana

ముగ్గురు మంత్రులుండి మూడు లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా?

ఆకాశాన్ని దించుతాం, సూర్యుని వంచుతాం అనే డైలాగులు కొడుతున్న రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు.. కాల్వ గండి పూడ్చాడం చాతకాదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

ముగ్గురు మంత్రులుండి మూడు లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా?
X

తలాపున సముద్రం ఉన్నా చేపపిల్లలు నీటి కేడ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్నా.. ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నాయి. పాలేరు జలాయశయానికి సెప్టెంబర్‌ 1న 100 మీటర్ల దిగువన కాలువకు గండి పడింది. గండి పడి 22 రోజులవుతున్నా పూడ్చడం చేతకాక కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పొలాలు ఎండబెడుతున్నది. ఒకవైపు కృష్ణనది నిండు కుండలా ఉన్నది. సాగర్ లో నీరున్నా పంటలన్నీఎండిపోతున్నాయి. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులు ఎన్ఎస్పీ ఆఫీసులను రైతులు ముట్టడిస్తున్నారు. పార్టీలకతీతంగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నిద్రపోతున్నది. గత ఏడాది నీరు లేక పొలాలు ఎండిపోయాయి. ఈసారి పుష్కలంగా వర్షాలు పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండి కూడా గండిపడిన కాల్వ పక్క నుంచే వెళ్తున్నారు. 22 రోజులైనా గండిపూడ్చాలని సోయిలేదా? అని ప్రశ్నించారు. ఆకాశాన్ని దించుతాం, సూర్యుని వంచుతాం అనే డైలాగులు కొడుతున్న రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు.. కాల్వ గండి పూడ్చాడం చాతకాదా? తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. మూడు లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా పూడ్చివేతలు రాదా? హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం వచ్చుగానీ.. రైతులకు నీరు ఇవ్వడం రాదా? కాంగ్రెస్‌కు రైతుల పట్ల జాలి, దయా లేవా? వరదల్లో కొట్టుకుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వరా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

కన్నీళ్లు తూడ్చడం కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్నది

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు కన్నీళ్లు తూడ్చడం కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఎకరాకు 25వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. వరద నష్టం వల్ల సాగర్ పరివాకం ప్రాంతాల్లో వల్ల 60వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకం వల్ల లక్ష ఎకరాలు పోయినట్లు ప్రాథమిక అంచనా. ఇప్పుడు ప్రభుత్వం నీరు ఇచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితులు లేవన్నారు. ఆగస్టు 15వ తేదీ ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్టు ప్రారంభించి, సీఎం, మంత్రులు డైలాగులు కొట్టారు. 70 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారుజఈ ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదు? పనులు పూర్తికాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామస్వామి మీద ఒట్టు పెట్టి.. మాట తప్పారు. దేవుడా రామచంద్రస్వామి ముఖ్యమంత్రిని క్షమించు, ఖమ్మం జిల్లా రైతులను కాపాడు అని కోరారు. ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు? తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిచడం వాళ్ల తప్పా? వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వరా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున మేం ఖమ్మం జిల్లాకు వెళ్తాం.. రైతులకు మనోధైర్యం చెబుతామన్నారు. ట్యాంకర్లు, జనరేటర్లు పెట్టుకొని పంటలు తడుపుకొంటున్నారు. దాడులకు బీఆర్ఎస్ ఏనాడు భయపడదు. వరద బాధితులను పరామర్శించేందుకు మాపై దాడులు చేశారు.

అధికారులూ అత్యుత్సాహం వద్దు

అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. పోలీసులు అత్యుత్సాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూశాం. పోలీసు అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి ప్రభుత్వాలకు లోబడి కాదన్నారు. గతంలో ఆంధ్రాలో అధికారులు రెచ్చిపోయారు.. ప్రస్తుతం సస్పెండ్‌ అవుతున్నారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అధికారులకు ఏపీలో పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్వాలు డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతుంటే, లక్షల మంది డెంగ్యూ చికెన్ గునియా విశ్వవిరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గుండాయిజం పెరిగిపోయింది.. అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి. రేవంత్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో రెండు వేల అత్యాచారాలు జరిగాయి. హైదరాబాద్, దేవరకద్రలో నిన్న ఒక రోజే రెండు అత్యాచారాలు జరిగాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

సునీతా లక్ష్మారెడ్డిపై ఇంటిపై దాడికి ప్రభుత్వానిదే బాధ్యత

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిపై ఇంటి మీద నిన్న రాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాత్రిపూట ఇంటి ముందు పటాకులు పేల్చి, తలుపులు తీయించి మరీ దాడులు చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి.పోలీసులు పట్టించుకోవడం లేదు.. దాడికి పాల్పడిన వారిపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాని హరీశ్‌డిమాండ్‌ చేశారు.

First Published:  23 Sept 2024 12:36 PM IST
Next Story