రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. మరో 10 మందికి గాయాలు
దేశాలకు వెళుతున్న తమ స్నేహితుడికి వీడ్కోలు పలికేందుకు వారు శంషాబాద్ విమానాశ్రయానికి కారులో వేగంగా వస్తున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న కారును తప్పించబోయి తూఫాన్ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు.
పెద్దగోల్కొండ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్‌కు చెందిన 12 మంది స్థానికుడైన తాజ్ అనే డ్రైవర్‌కు చెందిన తూఫాన్ వాహనంలో యాదాద్రికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా వస్తుండగా.. పెద్ద గోల్కొండ సమీపంలో ఓ కారు వీరి వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.
ప్రమాదానికి కారణమైన కారులో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. వారు కరీంనగర్‌కు చెందినవారు. విదేశాలకు వెళుతున్న తమ స్నేహితుడికి వీడ్కోలు పలికేందుకు వారు శంషాబాద్ విమానాశ్రయానికి కారులో వేగంగా వస్తున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న కారును తప్పించబోయి తూఫాన్ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. వారి కారు ఢీకొట్టిన వేగానికి తూఫాన్ వాహనం ఎగిరిపడింది. అందులో ఉన్న తాజ్ (40), వరాలు (35) ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న శంషాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, ఔటర్ పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని గాయపడినవారిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో 2 నెలల పసికందు అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో పన్నెండేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కారులోని విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారు. విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.