Telugu Global
Telangana

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఎలాంటి సూచికలూ లేకుండా రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపి ఉన్న ఇసుక లారీని వీరి వాహ‌నం వేగంగా ఢీకొట్టింది.

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
X

సెమిస్ట‌ర్ ప‌రీక్షలు ముగిశాయ‌న్న‌ ఆనందం వారికి ఎంతోసేపు నిల‌వ‌లేదు. చివ‌రి రోజు ప‌రీక్ష ముగించుకొని ఉత్సాహంగా ఇంటికి తిరిగి వెళుతున్న విద్యార్థులు రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. క్వాలిస్‌లో మొత్తం 11 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు వెళ్లి వ‌స్తుండ‌గా, అందులో ముగ్గురు ప్ర‌మాదంలో మృతిచెందారు. 8 మంది గాయాల‌పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా ఇంజినీరింగ్ విద్యార్థులే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

సిద్దిపేట శివారులోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్‌) ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వారం రోజులుగా రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడి పరీక్ష కేంద్రం రద్దవడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి పరీక్ష కాగా.. విద్యార్థి దేవచంద్ తన బంధువుకు చెందిన క్వాలిస్ వాహనం తీసుకొచ్చి మరో 10 మంది స్నేహితులను ఎక్కించుకున్న దేవ‌చంద్‌.. వాహ‌నాన్ని తానే న‌డిపాడు. ఉద‌యాన్నే కాలేజీకి బ‌య‌ల్దేరిన వీరంతా.. ఒంటిగంట‌కు ప‌రీక్ష పూర్త‌యిన అనంత‌రం తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఎలాంటి సూచికలూ లేకుండా రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపి ఉన్న ఇసుక లారీని వీరి వాహ‌నం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జవగా.. తీవ్రంగా గాయ‌ప‌డిన విద్యార్థులను స్థానిక పోలీసులు సిద్దిపేట ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. కలా విపిన్ చంద్రగౌడ్(18), నేతి నాగరాజు(19), పయ్యావుల గ్రీష్మ(18) చికిత్స పొందుతూ మృతిచెందారు.

తీవ్రంగా గాయపడిన సిద్దిపేటకు చెందిన చైతన్య, నమ్రతలను హైదరాబాద్‌లోని యశోదకు, సిద్దిపేట రూర‌ల్‌ మండలం పెద్దలింగారెడ్డిపల్లికి చెందిన దేవచంద్, నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన ప్రవల్లికను నిమ్స్‌కు తరలించారు. గ‌జ్వేల్‌కు చెందిన రాజు, దుబ్బాక మండ‌లం తిమ్మాపురానికి చెందిన సాయి నితిన్‌, మెదక్ జిల్లా చేగుంట మండలం గాంధీనగర్‌కు చెందిన సాయిచరణ్, రామాయంపేట‌కు చెందిన రోహిత్‌రెడ్డి స్వ‌ల్ప గాయాల‌తో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  13 Sept 2023 8:49 AM IST
Next Story