Telugu Global
Telangana

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరో మూడు రోజులు వర్షాలు

మరో మూడు రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు తిష్టవేసింది. మరో మూడురోజులు తమకు తిప్పలు తప్పవని డిసైడ్ అయ్యారు ప్రజలు.

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరో మూడు రోజులు వర్షాలు
X

తెలంగాణలో మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మరో మూడు రోజులు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో కూడా మరో మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటన విడుదల చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలో వర్ష బీభత్సం..

సరిగ్గా నెలన్నర రోజుల క్రితం కూడా వర్షాలతో తెలంగాణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏకంగా స్కూళ్లు కూడా మూతబడ్డాయి. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో స్కూళ్లు మూతబడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.

నిండుకుండల్లా ప్రాజెక్ట్ లు..

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులకు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 16 గేట్ల ద్వారా 49,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్ కి పొంచి ఉన్న ముప్పు..

వర్షాలతో ఈసీ, మూసీ ఉప్పొంగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్ నగరంలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రాణ నష్టం ఈసారి తప్పలేదు, డ్రైనేజీల్లో కొట్టుకుపోయి కొందరు, కరెంట్ షాక్ తో మరికొందరు మరణించారు. మరో మూడు రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు తిష్టవేసింది. మరో మూడురోజులు తమకు తిప్పలు తప్పవని డిసైడ్ అయ్యారు ప్రజలు.

First Published:  7 Sept 2023 3:46 PM IST
Next Story