Telugu Global
Telangana

ప్రచారానికి మూడు రోజుల విరామం.. కేసీఆర్ వ్యూహమేంటి..?

ప్రజా ఆశీర్వాద సభల తర్వాత ఎక్కడెక్కడ ఎలాంటి స్పందన వచ్చింది, మేనిఫెస్టో గురించి ప్రజల్లో ఏమేరకు చర్చ జరుగుతోంది అనే విషయాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్, సర్వే సంస్థల రిపోర్టులు, వార్ రూంల నుంచి వచ్చిన సమాచారంపై కూడా సమీక్షలు జరుగుతాయి.

ప్రచారానికి మూడు రోజుల విరామం.. కేసీఆర్ వ్యూహమేంటి..?
X

సీఎం కేసీఆర్ తొలిదశ ప్రచారం నిన్నటితో ముగిసింది. నిన్న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేసిన అనంతరం కామారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు కేసీఆర్. ఈరోజు, రేపు, ఎల్లుండి.. ప్రచార కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటారు. ఈనెల 13న రెండో విడత ప్రచార పర్వం మొదలు పెడతారు. ఈ మూడురోజులు కేసీఆర్ ఏం చేస్తారు..? ఆయన వ్యూహం ఏంటి..?

ఎన్నికల వేళ ప్రతి రోజు, ప్రతిగంట కూడా కీలకమే. హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఈసారి ప్రచారాన్ని ఉధృతంగా చేపట్టింది. స్వయంగా కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల తర్వాత మూడురోజులపాటు ఆయన ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారు. ఈ మూడురోజుల గ్యాప్ ని ఆయన ప్రచార సరళి పర్యవేక్షించడానికి, వివిధ నియోజకవర్గాలపై సమీక్ష చేపట్టడానికి కేటాయిస్తారని తెలుస్తోంది.

గజ్వేల్, కామారెడ్డిపై ఫోకస్..

ఈసారి గజ్వేల్ తోపాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలపై వైరి వర్గాలు కూడా దృష్టిపెట్టాయి. గజ్వేల్ లో ఈటల రాజేందర్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై పోటీకి దిగారు. ఆ రెండు చోట్లా గెలుపుతోపాటు మెజార్టీ కూడా బీఆర్ఎస్ కి కీలకం కాబోతోంది. ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.

మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో మిగతా నియోజకవర్గాలపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని అంటున్నారు. ప్రజా ఆశీర్వాద సభల తర్వాత ఎక్కడెక్కడ ఎలాంటి స్పందన వచ్చింది, మేనిఫెస్టో గురించి ప్రజల్లో ఏమేరకు చర్చ జరుగుతోంది అనే విషయాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్, సర్వే సంస్థల రిపోర్టులు, వార్ రూంల నుంచి వచ్చిన సమాచారంపై కూడా సమీక్షలు జరుగుతాయి. ప్రత్యర్థి వర్గాలు బలంగా ఉన్నచోట్ల రోడ్ షో లు నిర్వహించే విషయంపై కూడా చర్చలు జరుగుతాయి.

అటు ప్రతిపక్షాల్లోని కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ బలపడాలనేది కేసీఆర్ వ్యూహం. ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలు ఓడిపోతే ఆ పార్టీల మనోధైర్యం దెబ్బతింటుంది. ఆ ప్రభావం కచ్చితంగా 2024 లోక్ సభ ఎన్నికలపై కూడా పడుతుంది. అందుకే వైరి వర్గాల నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు.

ఇప్పటి వరకు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈనెల 18న చేర్యాలలో రోడ్ షో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సభలతో ఉపయోగం ఉంటుందా, లేక రోడ్ షో లు కూడా చేపట్టాలా అనే ఆలోచన చేస్తున్నారు నేతలు. ప్రచార పర్వం 20రోజుల లోపే ముగిసిపోతుండటంతో ఈ మూడురోజులు కీలక నిర్ణయాలకోసం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు విరామం ప్రకటించినట్టు తెలుస్తోంది. దీపావళి తర్వాత కేసీఆర్ రెండోదశ ప్రచారం మరింత జోరుగా సాగే అవకాశముంది.

First Published:  10 Nov 2023 9:56 AM IST
Next Story