Telugu Global
Telangana

సికిందరాబాద్ అగ్నిప్రమాదం లో ముగ్గురు సజీవదహనం ?

అగ్నిమాపక సిబ్బంది భవనం లోపలున్న ఏడుగురిలో నలుగురిని రక్షించగలిగారు. కానీ, భారీ ఎత్తున మంటలు, పొగ వల్ల వసీం, జునైద్, జహీర్ అనే ముగ్గురిని రక్షించలేకపోయారు. వారు లోపలే సజీవదహనమై బూడిదైపోయుంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

సికిందరాబాద్ అగ్నిప్రమాదం లో ముగ్గురు సజీవదహనం ?
X

సికిందరాబాద్ లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆ భవనంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదు. వారు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యుంటారని అధికారులు భావిస్తున్నారు.

రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో నిన్న ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల‌ వరకు 20 ఫైర్ ఇంజన్లు నిర్విరామంగా కృషి చేసి మంటల‌ను అదుపు చేయగలిగారు. అయితే మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది భవనం లోపలున్న ఏడుగురిలో నలుగురిని రక్షించగలిగారు. కానీ, భారీ ఎత్తున మంటలు, పొగ వల్ల వసీం, జునైద్, జహీర్ అనే ముగ్గురిని రక్షించలేకపోయారు. వారు లోపలే సజీవదహనమై బూడిదైపోయుంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

వసీం, జునైద్, జహీర్..ఈ ముగ్గురు బీహార్ కు చెందినవారుగా గుర్తించారు. డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ లో పని చేస్తున్న వీరిలో వసీమ్, జహీర్‌ నల్లగుట్టలో నివసిస్తుండగా, జునైద్‌ డెక్కన్ మాల్‌లో మూడో అంతస్తులో ఉంటున్నారు.

భవనం నిబంధనలకు విరుద్దంగా నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. ప్రమాద‍ జరిగితే తప్పించుకోవ‌డానికి భవనానికి మరో దారి కూడా లేదని అధికారులు చెప్తున్నారు. గోడౌన్ కు అనుమతి లేకపోయినా ఆ భవనంలో గోడౌన్ నిర్మించారని తెలిపారు. ప్రమాదానికి భవన యజమాని మహమ్మద్ ఓవైసీ, ఎంఏ రహీంలు కారణమని గుర్తించి.. వాళ్ళపై పోలీసులు కేసు నమోదు చేశారు.

First Published:  20 Jan 2023 11:27 AM IST
Next Story