Telugu Global
Telangana

పోస్టర్లు చింపితే ప్రశ్నలు ఆగుతాయా ?

మోడీ జవాబు చెప్పితీరాలంటూ 20 ప్రశ్నలతో హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. రేపు హైదరాబాద్ కు బీజేపీ అగ్రనేత అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

పోస్టర్లు చింపితే ప్రశ్నలు ఆగుతాయా ?
X

హైదరాబాద్ లో మళ్ళీ పోస్టర్ల యుద్దం మొదలయ్యింది. సెప్టంబర్ 17 న హైదరాబాద్ లో తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీని కోసం బీజేపీ శ్రేణులు ఏర్పాట్లలో తలమునకలయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ఆయనకు స్వాగతం పలుకుతూ పలు చోట్ల బీజేపీ పోస్టర్లు వేయగా, బీజేపీకి వ్యతిరేకంగా 'కంటోన్మెంట్ యూత్' పేరుతో వేలాది పోస్టర్లు వెలిశాయి. అందులో ప్రధాని మోడీకి 20 ప్రశ్నలు సంధించారు.

కంటోన్మెంట్ ప్రాంతంతో పాటు, 17వ తేదీన బీజేపీ సభ నిర్వహిస్తున్న పెరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఈ పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. మోడీ జవాబు చెప్పితీరాలంటూ 20 ప్రశ్నలను సంధించారు

తెలంగాణకు ఇస్తానని చెప్పిన పసుపు బోర్డు ఏమైంది ?

ఫార్మాసిటీకి ఆర్థిక సహాయం ఎందుకు చేయడంలేదు ?

ఐటీఐఆర్, ఐఐఎం, మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వడం లేదు?

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు?

హైదరాబాద్ కు వరద సహాయం ఎందుకు ఇవ్వలేదు?

కంటోన్మెంట్ రోడ్డును ఎందుకు ఓపెన్ చేయడం లేదు ?

ఖాజీపాట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు కేటాయించడంలేదు?

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించలేదు?

తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు ఇవ్వలేదు?

గోవా లిబరేషన్ డే కు 300 కోట్లు మంజూరు చేసి తెలంగాణ లిబరేషన్ డేకు ఎందుకు ఇవ్వలేదు?

హైదరాబాద్ కు ఇవ్వాల్సిన‌ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసన్ ను గుజరాత్ కు ఎందుకు తరలించారు ?

కంటోన్మెంట్ లో 30 వేల మంది ఓట్లు తీసేశారు వారిని తిరిగి ఓటర్ల లిస్ట్ లో చేర్చాలి.

మెగా పవర్ లూం టెక్స్ టైల్ క్లస్టర్ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు?

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిజైన్ ను తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు?

నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వలేదు?

మిషన్ భగీరథ కు నిధులు ఇవ్వాలని నీతీ ఆయోగ్ చెప్పినా ఎందుకు ఇవ్వలేదు?

ఇలాంటి 20 అంశాలతో 'కంటోన్మెంట్ యూత్' పోస్టర్లు అంటించారు. అయితే ఈ పోస్టర్లను పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు చింపేశారు. బీజేపీ నాయకులు పోస్టర్లను చించుతున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన టీఆరెస్ అధికార ప్రతినిధి క్రిశాంక్, పోస్టర్లు చింపితే ప్రశ్నలు ఆగుతాయా అని ప్రశ్నించారు.


First Published:  15 Sept 2022 3:26 PM IST
Next Story