Telugu Global
Telangana

ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఆ రెండు.. తెలంగాణకు మరోసారి అవార్డులు

సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో తెలంగాణ పల్లెలు పలు రంగాల్లో అవార్డులను గెలుచుకుంటున్నాయి.

ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఆ రెండు.. తెలంగాణకు మరోసారి అవార్డులు
X

తెలంగాణ పల్లెలు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో తెలంగాణ పల్లెలు పలు రంగాల్లో అవార్డులను గెలుచుకుంటున్నాయి. తాజాగా రాష్ట్రంలోని రెండు పల్లెలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచి హస్తకళలకు ప్రసిద్ధి చెందిన పెంబర్తి (జనగామ జిల్లా)తో పాటు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ గ్రామానికి ఈ అవార్డులు వరించాయి. అంతర్జాతీయ పర్యటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను అందించనున్నది.

ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారయ్యే వస్తువులు జర్మని, అమెరికా, బెల్జియం, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులు, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు ఇక్కడ తయారు చేస్తారు. చేతివృత్తుల నైపుణ్యానికి ఇక్కడి వస్తువులు ప్రతీకలుగా నిలుస్తాయి.

ఇన్ని విశేషాలు ఉన్న ఈ గ్రామానికి ఏటా 25 వేలకు పైగా పర్యటకులు సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ సంస్కృతిని కాపాడుతుండటంతో పాటు.. పర్యాటక రంగంలో ఆర్థికంగా కూడా జరుగుతున్న కార్యకలాపాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామంగా ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది.

సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ ప్రాంతంలో నేసే 'గొల్లబామ' చీరలు తెలంగాణ కళా సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నది. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవాన్ని ఈ చీరలో ఇనుమడింప చేశారు. దీంతో పాటు రంగనాయక స్వామి ఆలయం, కొండలు, ప్రకృతిని చూసేందుకు కూడా అనేక మంది పర్యటకులు వస్తుంటారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ కట్టిన తర్వాత పర్యాటకం మరింతగా పెరిగింది. అందుకే ఈ ఊరును కూడా ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు.

First Published:  26 Sept 2023 9:15 AM IST
Next Story