Telugu Global
Telangana

ఆ గుర్తులు తీసేయాలి....టీఆరెస్ ఎమ్మెల్యేల ధర్నా

మునుగోడు ఎన్నికల్లో కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు రోడ్ రోలర్ , రోటీ మేకర్ తదితర గుర్తులను కేటాయించడం పట్ల టీఆరెస్ మండిపడింది. రోడ్డు రోలర్ గుర్తును తీసేస్తూ ఎన్నికల సంఘం 2011లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, మళ్ళీ కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆరెస్ నాయకులు చండూరు ఆర్వో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

ఆ గుర్తులు తీసేయాలి....టీఆరెస్ ఎమ్మెల్యేల ధర్నా
X

టీఆరెస్ ఎన్నికల‌ గుర్తు కారును పోలిన గుర్తులను తీసివేయాలని డిమాండ్ చేస్తూ టీఆరెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ధర్నా చేశారు. రోడ్ రోలర్, రోటీ మేకర్, కెమెరా, సబ్బు పెట్టె, టెలివిజన్, పల్లకీ, కుట్టు మిషన్, ఓడ తదితర గుర్తులు కారును పోలి ఉండటంతో గతంలో టీఆరెస్ కు పడాల్సిన ఓట్లు ఆ గుర్తులకు పడ్డాయని టీఆరెస్ ఆరోపిస్తోంది. కాబట్టి ఆయా గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆరెస్ డిమాండ్ చేస్తోంది.


ఇదే డిమాండ్ తో మునుగోడు నియోజకవర్గం చండూరులో ఎన్నైకల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో టీఆరెస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు,ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నోముల భగత్, కోరుకంటి చందర్ తో సహా అనేకమంది కార్యకర్తలు ధర్నాకు దిగారు.

మరో వైపు ఈ గుర్తులను తీసేయాలని కోరుతూ టీఆరెస్ హైకోర్టును కూడా ఆశ్ర‌యించింది.

కాగా 2011 నవంబర్ లోనే ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును తీసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ మళ్ళీ ఆ గుర్తును ఈ సారి మళ్ళీ కేటాయించడం అప్రజాస్వామికమని టీఆరెస్ ఆరోపించింది. బీజేపీ చేతిలో ఎన్నికల సంఘం పావుగా మారిందని ద్వజమెత్తారు టీఆరెస్ నాయకులు.



First Published:  18 Oct 2022 11:39 AM IST
Next Story