Telugu Global
Telangana

అవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు..

ఈడీ, సీబీఐ వేటకుక్కల్లాంటి సంస్థలని, బీజేపీకి అనుబంధ సంస్థలుగా మారిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా అన్నట్లు మోదీ సర్కార్‌ వ్యవహరిస్తోందన్నారు.

అవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు..
X

ఎమ్మెల్సీ కవితకు పంపించింది ఈడీ సమన్లు కాదని, మోడీ సమన్లు అంటూ విమర్శించారు మంత్రి కేటీఆర్. వాటికి ఎవరూ భయపడబోరన్నారు. కవిత విచారణకు వెళ్తుందని, విచారణకు వెళ్లే దమ్ము తమకుందని చెప్పారు కేటీఆర్. ఎమ్మెల్యేలను కొనబోయి స్టే తెచ్చుకున్న బీఎల్‌ సంతోష్‌ లా కాదని, తాము విచారణలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. న్యాయవ్యవస్థ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని, జడ్జిలలో కొంతమంది బీజేపీ వాళ్లు ఉన్నా.. కొందరు మంచి జడ్జిలు కూడా ఉన్నారని చెప్పారు కేటీఆర్. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు.


అవి రెండు వేట కుక్కలు..

ఈడీ, సీబీఐ వేటకుక్కల్లాంటి సంస్థలని, బీజేపీకి అనుబంధ సంస్థలుగా మారిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా అన్నట్లు మోదీ సర్కార్‌ వ్యవహరిస్తోందన్నారు. దేశాన్ని మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు. మోదీ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలుబొమ్మ అని చెప్పారు. కవిత కేసే మొదటిది, చివరిది కాదని.. ఇకపై తమ పార్టీ నేతలను మరింతగా వేధిస్తారని, ఆ విషయం తమకు తెలుసని, అయినా కూడా ఎక్కడా ధైర్యం కోల్పోబోమని, తెలంగాణ ఎవరికీ తలవంచదని పునరుద్ఘాటించారు.

డబుల్ ఇంజిన్ అంటే..

డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ మోదీ గొప్పలు చెప్పుకోవడంపై కూడా విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఒక ఇంజన్‌ ప్రధాని.. మరో ఇంజన్‌ అదానీ.. ఇదే బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ నినాదమంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్‌. గౌతమ్‌ అదానీ, ప్రధాని మోదీ బినామీ అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడన్నారు. అదానీకి అక్రమంగా పోర్టులు కట్టబెట్టారని, ఎల్‌ఐసీ డబ్బులు ఆవిరైతే ప్రధాని ఉలకడు, పలకడని అన్నారు. దాదాపు రూ. 13 లక్షల కోట్లు ఆవిరైనా మోదీ, నిర్మల స్పందించరన్నారు. గుజరాత్‌ ముంద్రా పోర్టులో వేల కోట్ల హెరాయిన్‌ పట్టుబడితే స్పందించరని, గుజరాత్‌ లో కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా చనిపోతే పట్టించుకోరని, ఇవి స్కాంలు కాదా? అని ప్రశ్నించారు. అయినా అదానీపై కేసులు ఉండవని చెప్పారు. కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప లంచం తీసుకుంటూ దొరికిపోయినా కేసు పెట్టలేదని, పెట్టినా బెయిలుపై విడుదల చేశారన్నారు.

మోదీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలపై అక్రమంగా కేసులు పెట్టారని, దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడుల్లో 95 శాతం విపక్షాల పైనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. బీజేపీ వాళ్ల మీద పెట్టిన కేసులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ కూల్చింది నిజం కాదా? చందాల కోసం దందాలు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

First Published:  9 March 2023 2:21 PM IST
Next Story