కేసీఆర్ ముందుచూపు.. ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ఆ 50 రోజులు బోనస్
బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ఆగస్టు 21న ప్రకటించారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడానికి 50 రోజుల ముందే ఆయన అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణకు నవంబరు 30న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే ఎన్నికలకు మిగిలింది 50 రోజులే. ఏ పార్టీకయినా ఈ 50 రోజులే కీలకం. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అధికార బీఆర్ఎస్ పార్టీకి మాత్రం మొత్తంగా 100 రోజుల సమయం దొరికింది.
50 రోజుల ముందే అభ్యర్థుల ప్రకటన
బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ఆగస్టు 21న ప్రకటించారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడానికి 50 రోజుల ముందే ఆయన అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. దీంతో ఇప్పటికే వారు క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయారు. తద్వారా మిగిలిన పార్టీలతో పోల్చితే 50 రోజుల ముందే అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ పార్టీ సిద్ధమైపోయింది. మిగతా పార్టీలకు నోటిఫికేషన్ ఇచ్చాక 50 రోజుల టైమ్ దొరికితే బీఆర్ఎస్‌కు అంతకుముందే అభ్యర్థులను ప్రకటించడంతో దక్కిన 50 రోజులు బోనస్ అన్నమాట. ఈ 50 రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీ శ్రీకారం చుట్టింది. దళితబంధు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు లాంటి కీలక పథకాలను మళ్లీ పట్టాలెక్కించింది. అధికార పార్టీగా తనకున్న అడ్వాంటేజ్‌ను ఈ 50 రోజుల్లో పూర్తిస్థాయిలో వినియోగించుకుని ప్రజల్లోకి దూసుకెళ్లింది.
మేనిఫెస్టో ప్రకటించి, నేరుగా జనంలోకి..
ఈనెల 15న కేసీఆర్.. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తారు. అదే రోజు అభ్యర్థులకు బీఫారాలు అందజేస్తారు. అంటే ఆ రోజు నుంచి ఎన్నికల రణరంగంలోకి గులాబీ పార్టీ అన్ని అస్త్రశస్త్రాలతో సర్వసన్నద్ధంగా దిగిపోతుందన్నమాట. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరిట, ప్రభుత్వ పథకాల అందజేత పేరిట జనంలోకి ఓసారి వెళ్లారు. ఇక ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటిస్తే నేరుగా ఎన్నికల ప్రచారమే చేయొచ్చు. మొత్తంగా చూస్తే కేసీఆర్ ముందుచూపుతో 50 రోజుల కిందట అభ్యర్థుల ప్రకటన పార్టీని ఎన్నికల మూడ్‌లోకి తీసుకురావడం ఆ పార్టీకి అదనంగా 50 రోజుల సమయం కల్పించింది.