పర్యాటక ప్రదేశంగా మారనున్న రామగుండం బొగ్గు గని
రామగుండంలో మూసి వేసిన ఓ బొగ్గు గనిని టూరిస్ట్ స్పాట్ గా మార్చాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయింది. గనిలో ఒక కిలో మీటర్ లోపల క్యాంటీన్, ప్రొజెక్టర్, ఎయిర్ కండిషన్డ్ హాల్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.
భూగర్భంలోకి వెళ్ళడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. భూమి అడుగులో ఏముందో, అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. సింగరేణి కాలరీస్ యాజమాన్యం ఆ కోరికను తీర్చబోతోంది.
SCCL రామగుండం-II ప్రాంతంలో మూసివేసిన సెవెన్ LEP (లైఫ్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్) గనిని టూరిస్ట్ స్పాట్ గా మార్చడానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లోని నివాస ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉంది.
1991లో 7 ఇంక్లైన్ ప్రాజెక్ట్ పొడిగింపులో భాగంగా ప్రారంభించబడిన ఈ బొగ్గు గని నవంబర్ 2021లో మూసివేశారు. ఈ గనిలో 17మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంకాగా 16.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది.
బొగ్గు మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సూచనల ఆధారంగా, SCCL గనిని టూరిజం స్పాట్‌గా మార్చాలని నిర్ణయించింది మేనేజ్ మెంట్. ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఎస్‌సిసిఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ఐదుగురు జనరల్ మేనేజర్లతో కార్పొరేట్ స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ జీఎం సుభానీని నియమించారు.
ఈ ఏడాది మార్చిలో కార్పొరేట్ స్థాయి సాంకేతిక బృందం గనిని సందర్శించింది. నాగ్‌పూర్‌లోని పశ్చిమ బొగ్గు క్షేత్రాలు, జార్ఖండ్‌లోని ధన్‌బాద్, మధ్యప్రదేశ్‌లోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్‌లను సందర్శించి అక్కడ అభివృద్ధి చేసిన పర్యాటక బొగ్గు గనులను అధ్యయనం చేయాలని బృందం ఆలోచిస్తోంది.
డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇంకా ఖరారు కానప్పటికీ, సింగరేణి అధికారులు పర్యాటక గనిలో కొన్ని సౌకర్యాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. గని చాలా లోతుగా ఉన్నప్పటికీ, ఒక కిలోమీటరు లోతు వరకు పర్యాటకులను అనుమతించాలని SCCL అధికారులు అనుకుంటున్నారు. క్యాంటీన్, ప్రొజెక్టర్, ఎయిర్ కండిషన్డ్ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు, పిల్లలు గనిని సందర్శించే అవకాశం ఉన్నందున, సింగరేణి చరిత్రపై 10 నిమిషాల డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించాలని కంపెనీ అధికారులు యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, ఈ గనిని సమీపంలోని తీర్థయాత్ర కేంద్రాలను కలుపుతూ టూరిజం ప్యాకేజీని అందించాలని TSRTC ఆలోచిస్తోంది. గత నెలలో కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటించిన టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కూడా టూరిజం ప్యాకేజీపై చర్చించారు.
ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో మూడు, నాలుగు నెలలు పట్టవచ్చని SCCL డైరెక్టర్ (ఆపరేషన్స్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ & వెల్ఫేర్) ఎస్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు.