Telugu Global
Telangana

గ్రామీణ పారిశ్రామికీకరణ వల్ల రైతులకు కలుగుతున్న లాభం ఇదే.. సక్సెస్ స్టోరీ చెప్పిన మంత్రి కేటీఆర్

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో రూ.70 కోట్లతో 'ప్లాంట్ లిపిడ్స్' రోజుకు 150 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన యూనిట్ నెలకొల్పింది.

గ్రామీణ పారిశ్రామికీకరణ వల్ల రైతులకు కలుగుతున్న లాభం ఇదే.. సక్సెస్ స్టోరీ చెప్పిన మంత్రి కేటీఆర్
X

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. కంపెనీలు, పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కన మాత్రమే స్థాపించకుండా.. గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింప చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా.. రైతులు నష్టపోకుండా అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పుతోంది. గ్రామీణ పారిశ్రామికీకరణ వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయో మంత్రి కేటీఆర్ వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సక్సెస్ స్టోరీని తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

తెలంగాణలో మిర్చి పంటను అత్యధికంగా పండించే జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటి. ఇక్కడ ఏడాదికి దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి దిగుబడి జరుగుతోంది. తెలంగాణలో పండే మిర్చి పంటలో ఇది 25 శాతం. అంతే కాకుండా.. ఇక్కడ పండే మిర్చి పంట అత్యధిక నాణ్యత కలిగి ఉండి.. అంతర్జాతీయంగా ఆమోదం పొందింది కావడం గమనార్హం.

ఇక్కడి రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండు భారీ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్లకు వేగంగా అనుమతులు జారీ చేసింది. దీంతో మహబూబాబాద్ జిల్లాలో ఏడాదికి 1 లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ప్రాసెసింగ్ యూనిట్లను ప్రైవేట్ సంస్థలు నెలకొల్పాయి. ఇక్కడి యూనిట్లలో మిర్చి నుంచి 'అలియోరెసిన్' అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే అలియోరెసిన్ ప్రపంచంలోని 85 దేశాలకు ఎగుమతి అవుతోంది. ప్లాంట్ బేస్డ్ అలియోరెసిన్ ఉత్పత్తిలో ఈ రెండు కంపెనీలు కలిపి గ్లోబల్ మార్కెట్‌లో 50 శాతం వాటా కలిగి ఉండటం విశేషం.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో రూ.70 కోట్లతో 'ప్లాంట్ లిపిడ్స్' రోజుకు 150 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన యూనిట్ నెలకొల్పింది. 'విద్యా హెర్బ్స్' అనే సంస్థ కూడా 150 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన యూనిట్‌ను రూ.50 కోట్లతో మరిపెడ మండలంలో నిర్మించింది. రాబోయే రోజుల్లో మరో రూ.150 కోట్లతో తమ యూనిట్ విస్తరిస్తామని విద్యా హెర్బ్స్ ప్రకటించింది. ప్లాంట్ లిపిడ్స్ కూడా విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఈ రెండు ప్రాసెసింగ్ యూనిట్లు జిల్లాలో ఉండటం వల్ల మిర్చి ధరల స్థిరీకరణ జరిగింది. అంతే కాకుండా స్థానిక రైతులకు మంచి ధర, మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా మిర్చిని రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల రైతులు తమ పంటను దళారుల చేతిలో పెట్టి మోస పోకుండా మంచి ధరకు అమ్ముకునే వెసులుబాటు కలిగింది.

స్వయం సహాయక సంఘాలు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు రవాణా ఖర్చులు లేకుండా పోయాయి. అలాగే కమీషన్లు కూడా ఎవరికీ ముట్ట చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో మార్కెట్ కంటే 10 నుంచి 20 శాతం అదనంగా ఆదాయం లభిస్తోంది. ఇప్పటి వరకు ప్లాంట్ లిపిడ్స్ సంస్థ రైతుల నుంచి రూ.100 కోట్ల విలువైన 5వేల మెట్రిక్ టన్నుల పంటను కొనుగోలు చేసింది.

వచ్చే ఏడాది ఈ రెండు సంస్థలు రూ.400 కోట్ల విలువైన 20వేల మెట్రిక్ టన్నుల పంటను స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.


First Published:  2 July 2023 10:30 AM IST
Next Story