Telugu Global
Telangana

ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాబందు ప్రభుత్వం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు దళారుల పాలయ్యాయి : మాజీ మంత్రి హరీశ్‌ రావు

ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాబందు ప్రభుత్వం
X

ఇది రైతు ప్రభుత్వం కాదు రాబందు ప్రభుత్వమని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు గడప దాటడం లేదన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్‌లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 91 లక్షల టన్నుల సన్నవడ్లు కొంటామని చెప్తోన్న ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వడ్లన్నీ దళారుల పాలయ్యాయని అన్నారు. రాఘవాపూర్‌ లో నాలుగు వేల క్వింటాళ్లకు పైగా వడ్లను రైతులు మిల్లర్లు, దళారులకు అమ్ముకున్నారని తెలిపారు. అబ్దుల దేవయ్య అనే రైతు 92 క్వింటాళ్ల వడ్లు కల్లంలో పోసి నెల రోజులు ఎదురు చూసి క్వింటాల్‌ వడ్లను రూ.1,900లకు అమ్ముకున్నాడని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ చేతగానితనంతో ఆ ఒక్క రైతు రూ.81 వేలు నష్టపోయాడని తెలిపారు. ఒక్క మంత్రి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోయి రైతుల గోసను చూడటం లేదన్నారు. ప్రభుత్వం వడ్లు కొంటుందో లేదోననే భయంతో రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నమేది ప్రభుత్వం చేయడం లేదన్నారు. కేసీఆర్‌ పంట సాగు దశలోనే రైతుబంధు ఇచ్చేవారని.. రేవంత్‌ వచ్చాక రైతుబంధు ఎగబెట్టిండని.. బోనస్‌ ను బోగస్‌ చేశాడని.. వడ్లుకొనే దిక్కులేని పరిస్థితి కల్పించాడన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే 30 శాతం మంది రైతులు తమ వడ్లను దళారులకు అమ్ముకున్నారని, ఇప్పటికైనా మద్దతు ధర చెల్లించి వడ్లు కొనే ప్రయత్నం చేయాలన్నారు. వానాకాలంలో ఎగవేసిన రైతుబంధుతో పాటు యాసంగి పంటకు కలిపి ఎకరానికి రూ.15 వేలు వెంటనే జమ చేయాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఒట్లు పెట్టి రేవంత్‌ మోసం చేశాడన్నారు. కేసీఆర్‌ కిట్టు బంద్‌, మహిళలకు బతుకమ్మ చీరలు, రైతుబంధు బంద్‌ పెట్టాడని, రెండు నెలల పెన్షన్‌ ఎగవేశాడని అన్నారు. తన జన్మదినం సందర్భంగా యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి దర్శనానికి వెళ్తోన్న రేవంత్‌ రెడ్డి ఆయనపై ఒట్టు పెట్టి రుణమాఫీ పూర్తి చేయనందుకు ముందుగా ముక్కు నేలకు రాయాలన్నారు. రేవంత్‌ కు దేవుడు ఇంకా నాలుగేళ్ల సమయం ఇచ్చాడని, ప్రజలకు ఇకనైనా మంచి చేయాలని సూచించారు. ఎద్దు ఏడ్చినా వ్యవసాయం, రైతు ఏడ్చినా రాజ్యం ఎప్పుడు బాగుపడదని అన్నారు. కరెంటు సరిగా ఇవ్వక మోటార్లు కాలుతున్నాయని, యాసంగి పంట వెయ్యడానికే రైతులు భయపడుతున్నారని అన్నారు. ఏఐసీసీ ట్విట్టర్ లో తెలంగాణాలో 24 గంటల కరెంటు ఇస్తున్నాం అని పెట్టుకుంటున్నారు, ఎక్కడ 24 గంటల కరెంట్‌ వస్తుందో చెప్తే బాగుంటుందన్నారు.

First Published:  6 Nov 2024 6:58 PM IST
Next Story