Telugu Global
Telangana

రాజ్యాంగ సంస్థలను బీజేపీ ఎలా వాడుకుంటుందో స్పష్టంగా తెలిసింది : మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ గుర్తు అయిన కారుతో పోలి ఉన్న గుర్తులను పెట్టి.. ఓటర్లను అయోమయానికి గురి చేసి, దొడ్డి దారిన ఓట్లు పొందే కుటిలయత్నాలను బీజేపీ చేస్తోందని ఆయన ఆరోపించారు.

రాజ్యాంగ సంస్థలను బీజేపీ ఎలా వాడుకుంటుందో స్పష్టంగా తెలిసింది : మంత్రి కేటీఆర్
X

నిబంధనల మేరకు పని చేసిన మునుగోడు రిటర్నింగ్ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ తీరు ఆక్షేపణీయమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ ఎలా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరొక నిదర్శనమని ఆయన విమర్శించారు. 'రోడ్డు రోలర్' గుర్తు విషయంలో అభ్యంతరాలు ఉండటంతో ఆర్వో దానిని రద్దు చేసి యుగతులసి పార్టీ అభ్యర్థికి బేబీ వాకర్ గుర్తు కేటాయించిన విషయంలో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన రోడ్డు రోలర్‌నే తిరిగి యుగతులసి పార్టీకి కేటాయిస్తూ గెజిట్ కూడా జారి చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ వ్యవహారశైలిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పైన బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్ రోలర్ గుర్తును తిరిగి ఎన్నికల్లో కేటాయించడం అంటే ప్రజాస్వామ్య స్పూర్తిని అపహాస్యం చేయడమే' అని కేటీఆర్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన మేరకు గతంలో రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల కమిషన్ తొలగించిందని ఆయన గుర్తు చేశారు. కానీ, మునుగోడు ఎన్నికల్లో అదే గుర్తును తేవడం అంటే ఎన్నికల స్పూర్తికి పూర్తిగా విరుద్దమని అన్నారు. తమ పార్టీ గుర్తు అయిన కారుతో పోలి ఉన్న గుర్తులను పెట్టి.. ఓటర్లను అయోమయానికి గురి చేసి, దొడ్డి దారిన ఓట్లు పొందే కుటిలయత్నాలను బీజేపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యాంగ స్పూర్తికి ఇది విఘాతం కలిగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ తన స్వప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ద సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందో ప్రజలు గమనించాలని కేటీఆర్ కోరారు. నిబంధనల ప్రకారమే పని చేసిన రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ నాయకత్వలోనే ఎన్నికల కమిషన్ పని చేస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామని భయపడే బీజేపీ ఇలాంటి అడ్డదారులు తొక్కుతోందని కేటీఆర్ అన్నారు.



First Published:  20 Oct 2022 3:28 PM IST
Next Story