ఏడాదిలో ఈ ప్రభుత్వం ఇచ్చింది 12 వేల ఉద్యోగాలే
కేసీఆర్ నోటిఫికేషన్లు తమవి అని చెప్పుకుంటోన్న దివాళా కోరుతనం రేవంత్‌ది : కేటీఆర్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలో ఇచ్చింది 12 వేల ఉద్యోగాలు మాత్రమేనని, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లను తమ ఖాతాలో వేసుకుంటున్న దివాళాకోరుతనం రేవంత్ రెడ్డిది అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దుర్గం చిన్నయ్య, మెతుకు ఆనంద్, సీనియర్ నేత దేవిప్రసాద్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి బండారం బయట పెట్టేలా రాహుల్‌గాంధీకి లేఖ రాస్తానని తెలిపారు. అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని, ఈ నాటకాలు రాహుల్ గాంధీకి తెలిసే ఆడితే ప్రజల ముందు దోషులుగా నిలబెడుతామన్నారు. రేవంత్ ఎన్ని తప్పుడు కూతలు కూసినా వదిలి పెట్టేది లేదన్నారు. రేవంత్ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అప్పులను సాకుగా చూపుతున్నాడని అన్నారు. రేవంత్ సీఎం అయ్యాక ఆ పదవికి ఉన్న పరువు తగ్గిందని, 11 నెలల పాలనలో అనుముల సోదరులు రాష్ట్రానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగారని అన్నారు. రాష్ట్రం దివాళా స్థితిలో ఉంటే రేవంత్ సోదరులు ఫోర్బ్స్ జాబితాలో చేరే స్థాయికి ఎదుగుతున్నారని తెలిపారు. రాష్ట్రం దివాళా తీయలేదని.. దివాళాకోరుతు సీఎంతో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి పోతున్నాయని తెలిపారు.
తెలంగాణ రైజింగ్ అంటూ కొత్త నాటకానికి తెర లేపారని, అనుముల బ్రదర్స్ మాత్రమే రైజింగ్‌లో ఉన్నారని.. తెలంగాణ ఫాలింగ్‌లో ఉందన్నారు. అబద్ధాలు.. అసత్యాలు.. అటెన్షన్ డైవర్షన్ టెక్నికులు మాత్రమే రేవంత్ కు తెలుసని, 11 నెలల్లో మీడియా మేనేజ్‌మెంట్ తప్ప ఇంకా చేసిందేమి లేదన్నారు. రేవంత్ తప్పులను దాచే ప్రయత్నం ఊరుకోబోమని హెచ్చరించారు. గతంలో ఇండియా షైనింగ్ అన్నోళ్లే గతి లేకుండా కొట్టుకుపోయారని.. రేవంత్ కు అదే గతి తప్పదన్నారు. రేవంత్ ఏడాది కాలం కారు కూతలు, కుప్పిగంతులతో టైం పాస్ చేశారన్నారు. ప్రభుత్వం తెచ్చిన శ్వేతపత్రానికి బీఆర్‌ఎస్ శ్వేదపత్రంతో సమాధానం ఇచ్చిందన్నారు. అప్పులు గురించి కాదు ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసని టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పి.. ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. ఉద్యోగాలు, గ్యారంటీల అమలు అన్ని అబద్ధాలేనని అన్నారు. ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం రైతుల ఖాతాల్లో పడ్డది రూ.11 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. డబ్బు సంచులతో దొరికిన దొంగ నీతులు చెప్తున్నాడని అన్నారు. రైతులు, చేనేత కార్మికులు, ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నందుకు విజయోత్సవాలా అని ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. గురుకులాలు సరిగా నడపడం చేతకాక తనతో పాటు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పై కుట్ర కేసులు పెడుతున్నారని అన్నారు.
రేవంత్ చేతగానితనంతోనే రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. ఆర్‌బీఐ నివేదికలు, సోషియో ఎకనామిక్ సర్వే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని చాటి చెప్తున్నాయన్నారు. అప్పులు, వడ్డీలపై ప్రభుత్వం చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని అన్నారు. 2014లో రూ.364 కోట్ల రెవెన్యూ సర్‌ప్లస్‌తో కాంగ్రెస్ తమకు తెలంగాణను అప్పజెప్తే 2024 నాటికి రెవెన్యూ సర్‌ప్లస్ రూ.5,944 కోట్లకు పెంచామన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పులనేది అతిపెద్ద అబద్ధమని.. అబద్ధానికి అంగీలాగు తొడిగితే రేవంత్ అవుతాడని అన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమేనని చెప్పారు. అప్పులపై గోబెల్స్‌కు మించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.లక్ష కోట్లకు పైమాటేనని తెలిపారు. ఆర్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నేరుగా రూ.85 వేల కోట్లు, కార్పొరేషన్ల ద్వారా రూ.29.87 వేల కోట్ల అప్పలు తెచ్చారని తెలిపారు. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రతినెలా రూ.2,900 చొప్పున అప్పులు, వడ్డీలకు రీపేమెంట్ చేస్తున్నారని తెలిపారు. మరి నెలకు రూ.6,500 కోట్లు అప్పులు, వడ్డీలకు రీపేమెంట్ చేస్తున్నామని రేవంత్ ఎట్లా చెప్తాడని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రాష్ట్ర సంపద మొత్తం ఎటు పోతుంది? ఏపీ జేబులోకా.. ఢిల్లీ సంచుల్లోకా? అని ప్రశ్నించారు. సీఎం చెప్పే అబద్ధాలను నమ్మి మీడియా గోల్ మాల్ కావొద్దని సూచించారు. కాళేశ్వరం లేకుండా రికార్డు పంటలు పండాయని కాంగ్రెస్ చెప్తోందని, అదే నిజమైతే 2014కు ముందు ఇంతస్థాయిలో పంటలు ఎందుకు పండలేదో చెప్పాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిజాలను దాచి పెడుతోందని.. సమాచార హక్కు చట్టం ప్రకారం వచ్చిన అప్లికేషన్లకూ సమాధానం చెప్పడం లేదన్నారు. డీపీఆర్ లేకుండా భూసేకరణ చేయొద్దని గతంలో అన్న రేవంత్ రెడ్డి.. కొడంగల్ కు అదానీ వస్తుండా.. అల్లుడి కంపెనీ వస్తుందా అనేది చెప్పకుండానే భూసేకరణ ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. నియంతలా పాలన చేస్తూ ఉన్న సిటీని నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఫోర్త్ సిటీ అంటున్నాడని మండిపడ్డారు. ఎస్‌ఆర్‌డీపీ పనులన్నీ ఆగిపోయాయని చెప్పారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తెలుసని.. పరిపాలన చేయడం చేతకావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 500 ఎకరాలు దోచిపెట్టేందుకే లగచర్లలో భూసేకరణకు పూనుకున్నారని తెలిపారు. రూ.20 లక్షలకు ఎకరం భూమి భూసేకరణలో ఇవ్వడానికి రేవంత్ రెడ్డి కుటుంబం రెడీ అంటే అదనంగా ఇంకో రూ.5 లక్షలు ఇవ్వడానికి బీఆర్‌ఎస్ రెడీగా ఉందన్నారు. రేవంత్ కుటుంబానికి ఒక నీతి.. గిరిజనులకు ఇంకో నీతా అని ప్రశ్నించారు. కేబినెట్ విస్తరణ జరిగితే బాంబులు పేలుతాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. తెలంగాణలో ఒక కేబినెట్ మినిస్టర్‌కు ఉన్న పరపతి కూడా రేవంత్ రెడ్డికి ఢిల్లీలో లేదన్నారు. నాలుగేళ్ల తర్వాత సెక్రటేరియట్ ఎదురుగా రాహుల్ గాంధీ తండ్రి విగ్రహ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. దేశాభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ తల్లి ఘనంగా ఉండాలే తప్ప పేదరికం తాండవించే తల్లిలా ఉండొద్దన్నారు. చూడగానే దండం పెట్టేంత గొప్ప విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేస్తామన్నారు.