ఇవాళ బీజేపీ థర్డ్ లిస్ట్.. జనసేనకు ఎన్ని సీట్లంటే..!
ఇప్పటివరకూ బీజేపీ 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి లిస్ట్‌లో 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలనాథులు.. రెండో లిస్టును కేవలం ఒకే ఒక్క పేరుతో రిలీజ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల ఎంపిక తుదిదశకు చేరుకుంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, జనసేనతో పొత్తు అంశంపై చర్చించి ఫైనల్ చేయనున్నారు. అనంతరం మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇప్పటివరకూ బీజేపీ 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి లిస్ట్‌లో 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలనాథులు.. రెండో లిస్టును కేవలం ఒకే ఒక్క పేరుతో రిలీజ్ చేశారు. రెండో లిస్టులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని ప్రకటించారు. ఆయన మహబూబ్‌నగర్ నుంచి బరిలో దిగనున్నారు.
ఇక మరో 66 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ సహా పలువురు సీనియర్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పలు స్థానాల్లో ఇద్దరు ఆశావహులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా బోధన్, పెద్దపల్లి, హుస్నాబాద్, షాద్‌నగర్, ముషీరాబాద్, మలక్‌పేట, పరకాల, ఖమ్మం, ములుగు స్థానాలకు ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.
మరోవైపు బీజేపీపై అసంతృప్తితో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. వివేక్‌కు పెద్దపల్లి లోక్‌సభ సీటుతో పాటు ఆయన కుమారుడు గడ్డం వంశీకి చెన్నూరు సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం.
ఇక పొత్తులో భాగంగా జనసేనకు 9 నుంచి 11 స్థానాలు కేటాయించే అవకాశాలున్నాయి. అయితే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలు జనసేనకు ఇచ్చే అవకాశాలున్నాయన్న ప్రచారంతో స్థానిక బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఆఫీసు దగ్గర నిరసనలు తెలియజేశారు. కాగా, జనసేనకు ఎన్ని స్థానాలు ఇస్తారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.