సిరిసిల్ల బరిలో తీన్మార్ మల్లన్న.. కేటీఆర్‌పై పోటీకి సై..!
నిన్న, మొన్నటి వరకు తీన్మార్ మల్లన్న మేడ్చల్ నుంచి పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. ఆయన కూడా మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించారు.
అధికార బీఆర్ఎస్ పార్టీకి సిరిసిల్ల కంచుకోట. శాసనసభ్యుడిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో కేటీఆర్‌పై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి లేదా ఉత్తమ్ కుమార్‌ను కేటీఆర్‌పై పోటీకి దింపాలని ఆలోచనలు జరిపింది. అయితే పార్టీ సీనియర్లు కేటీఆర్‌పై పోటీకి నిరాకరించడంతో ఇప్పుడు కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చారు. ఆయనే తీన్మార్ మల్లన్న.
నిన్న, మొన్నటి వరకు తీన్మార్ మల్లన్న మేడ్చల్ నుంచి పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. ఆయన కూడా మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉంటానని, మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ వజ్రేష్ యాదవ్‌ను మేడ్చల్‌లో అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించని నియోజకవర్గాల్లో సిరిసిల్ల కూడా ఉంది. సీనియర్ నేతలు పోటీకి నిరాకరిస్తుండటంతో సిరిసిల్ల బరిలో నిలబడేందుకు తీన్మార్ మల్లన్న ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం.
సిరిసిల్ల నుంచి ఉద్యమకారుడు కె.కె.మహేందర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, కేటీఆర్‌ను ఎదుర్కొనగలిగే వ్యక్తిని బరిలో దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అయితే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారా.. లేక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే కాంగ్రెస్ మద్దతిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమను పోటీకి దింపింది.
2009లో ఫస్ట్ టైం సిరిసిల్ల నుంచి పోటీ చేసిన కేటీఆర్..అప్పటి నుంచి జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. 2010 బైపోల్‌తో కలిపి ఇప్పటివరకూ నాలుగు సార్లు సిరిసిల్ల నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె.కె.మహేందర్ రెడ్డిపై 89 వేల మెజార్టీతో కేటీఆర్ విజయం సాధించారు. ఈ సారి లక్ష మెజార్టీ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు.