కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసిన ఖర్గే

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఖరారు చేశారు. ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. కాంగ్రెస్ అధిష్టానం ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది. ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికే పెద్దపీట వేసినట్టు కనిపించింది. రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు తీసుకున్నా.. పార్టీ దీర్ఘకాలిక లక్ష్యాల దృష్ట్యా సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యేల కోటా నుంచి ఐదు ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్నది. ఎమ్మెల్సీల సంఖ్యా బలం ఆధారంగా మూడు కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌కు ఒకటి వస్తాయి. ఐదో స్థానం కోసం ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమౌతాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌కు నాలుగో సీటు వచ్చే అవకాశం ఉన్నా.. సుప్రీంకోర్టు కేసు నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సీపీఐ కోరింది. దీంతో ఆ పార్టీకి ఒక స్థానం కేటాయించారు. అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యవర్గం చర్చిస్తున్నది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఆశావహుల్లో నెల్లికంటి సత్యం యాదవ్, చాడ వెంకటరెడ్డి ఉన్నారు. ఇవాళ రాత్రిలోపు సీపీఐ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నది.