Telugu Global
Telangana

బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ప్రవేశపెట్టిన 7 తీర్మానాలు ఇవే

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే. కేశవరావు ప్రసంగంతో సభ ప్రారంభమైంది. ఆ తర్వాత అధ్యక్షుడు కేసీఆర్ ప్రసంగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.

బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ప్రవేశపెట్టిన 7 తీర్మానాలు ఇవే
X

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి చేరుకున్న అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ ప్రతినిధుల సభ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సభకు హాజరయ్యారు. కేవలం ఆహ్వానించిన 279 మందికి మాత్రమే సభలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు.

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే. కేశవరావు ప్రసంగంతో సభ ప్రారంభమైంది. ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. వీటికి ఆమోదం తెలిపిన తర్వాత భోజన విరామం ఇచ్చారు. కాగా, బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన తీర్మానాలు చాలా వరకు జాతీయ రాజకీయ కోణంలోనే ఉన్నాయి. దేశంలో మౌలిక వసతులను మెరుగుపరిచే ప్రణాళికపై కూడా తీర్మానం ఉన్నది. రైతులు, దళితులు, బీసీల ఉన్నతికి పాటుపడాలని మరో తీర్మానం చేశారు.

మొదటి తీర్మానం :

బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ఒక సమగ్ర సాగునీటి విధానాన్ని రూపొందించాలని తీర్మానించారు. తెలంగాణలో వచ్చిన రైతు రాజ్యాన్ని దేశమంతటా స్థాపించాలని కూడా పేర్కొన్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేయాలని ప్రతినిధుల సభ తీర్మానించింది.

రెండో తీర్మానం :

రైతు బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశమంతటా విస్తరించి, పంటలు పండించే రైతులను పాలకులుగా మార్చాలని.. హలం పట్టిన చేతులతో కలం పట్టించి చట్టాలను తయారు చేయించాలని, మట్టిని పిసికిన చేతులు మంచి ప్రణాళికలను రూపొందించాలని, రైతు సంక్షేమం వర్ధిల్లే విధంగా దేశంలో నిజమైన రైతు రాజ్యాన్ని నెలకొల్పే దిశగా బీఆర్ఎస్ పురోగమించాలని మరో తీర్మానం చేశారు.

మూడో తీర్మానం :

దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం దేశ విధాన నిర్ణేతగా బీఆర్ఎస్ అవతరించాలని మూడో తీర్మానం చేశారు.

నాలుగో తీర్మానం :

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారతదేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ అద్భుతమైన ప్రణాళికలను రచిస్తున్నది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే దేశంలో భారీస్థాయిలో అద్భుతమైన మౌలిక వసతుల కల్పన జరిపించాలని తీర్మానించారు.

ఐదో తీర్మానం :

ఇంతకాలం వెనుకబాటుకు గురైన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తున్నది. భవిష్యత్తులో దేశ పరిపాలనా విధానాన్ని నిర్ణయించే శక్తిగా బీఆర్ఎస్ ఎదిగి, శాస్త్రీయంగా జనగణనను జరపాలని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల జనగణన జరిపి, ఆ గణాంకాల ఆధారంగా వెనుకబడిన వర్గాలకు తగిన ప్రయోజనాలను అందించాలని తీర్మానించారు. అదేవిధంగా కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆ దిశగా బీఆర్ఎస్ పురోగమించాలని ప్రతినిధుల సభ తీర్మానించింది.

ఆరో తీర్మానం :

మతోన్మాద శక్తుల దుష్పరిపాలన వల్ల మరో వందేళ్లు వెనక్కు వెళ్లే దుర్గతి మన దేశానికి పట్టకుండా ఉండాలంటే దేశ యువత వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాలని బిఆర్ఎస్ విస్తృతసభ పిలుపునిచ్చింది. మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్న ఆటవిక, అనాగరిక, అరాచక సంస్కృతిని రూపుమాపేందుకు, ద్వేషం స్థానంలో ప్రేమను, అసహనం స్థానంలో సామరస్యాన్ని, అలజడి స్థానంలో ప్రశాంతతను ప్రతిష్ఠించేందుకు భారతీయ పౌరులందరూ ఏకం కావాలని బిఆర్ఎస్ తీర్మానించింది.

ఏడో తీర్మానం :

నవీన దృక్పథంతో, నూతన చేతనతో దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే లక్ష్యాన్ని బీఆర్ఎస్ స్వీకరించిందని మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్టీల గెలుపే గెలుపు కాకూడదని, అది ప్రజల గెలుపు కావాలని బీఆర్ఎస్ నమ్ముతున్నదని అందులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కేవలం ఎన్నికల కోసమో, అధికారం కోసమో పుట్టిన పార్టీ కాదని.. దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకే పుట్టిందని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రజల ఆలోచనా సరళిలోనూ, వారి జీవితాల్లోనూ గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ అప్రతిహతంగా పురోగమించాలని సభ తీర్మానించింది.

First Published:  27 April 2023 5:14 PM IST
Next Story