Telugu Global
Telangana

తెలంగాణ పాఠశాలల వేళల మార్పులేదు.. విద్యార్థులను బయటకు తీసుకెళ్లొద్దు

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన సూచనల మేరకు విద్యా శాఖ తాజాగా ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

తెలంగాణ పాఠశాలల వేళల మార్పులేదు.. విద్యార్థులను బయటకు తీసుకెళ్లొద్దు
X

భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో అద్భుమైన ఘట్టానికి నేడు తెరలేవనున్నది. ఇస్రో చరిత్రలోనే చంద్రయాన్-3 ఒక మైలురాయిగా నిలవనున్నది. అన్నీ సక్రమంగా జరిగితే ఈ రోజు సాయంత్రం 6.04 తర్వాత విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనున్నది. ఇంతటి అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తొలుత నిర్ణయించింది. విద్యార్థులను సాయంత్రం 6.30 గంటల వరకు ఉంచి.. వారికి లైవ్ టెలికాస్ట్ చూపించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన సూచనల మేరకు విద్యా శాఖ తాజాగా ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టే దృశ్యాలను ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నది. కాబట్టి విద్యార్థులు ఇంటి వద్ద టీవీలు, మొబైల్స్‌లో చూడవచ్చని చెప్పింది. మొబైల్స్‌లో ఎలా చూడాలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించింది. అంతే కాకుండా టీ-శాట్, నిపుణ ఛానల్స్‌లో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4.30 గంటల నుంచి టీ-శాట్, నిపుణ ఛానెల్స్‌లో లైవ్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

రెసిడెన్షియల్ స్కూల్స్‌లో మాత్రం విద్యార్థుల కోసం తప్పకుండా లైవ్ టెలికాస్ట్ చేయాలని ఆదేశించింది. రేపు గురువారం పాఠశాల వేళల సమయంలో రికార్డు చేసిన దృశ్యాలను విద్యార్థులందరికీ చూపించి.. చంద్రయాన్-3 గురించి వివరించాలని విద్యా శాఖ డీఈవోలకు స్పష్టం చేసింది. కాగా, చంద్రయాన్-3 లైవ్ టెలికాస్ట్ చూపించడానికి విద్యార్థులను బయటకు తీసుకొని వెళ్లవద్దని ఆదేశించింది.


First Published:  23 Aug 2023 7:04 AM IST
Next Story