Telugu Global
Telangana

రేషన్ కార్డు దరఖాస్తు ఫాములన్నీ ఫేక్

అప్లయ్‌ చేసినవాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు అధికారులు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. కాకపోతే ఇకనుంచి డబ్బులు పెట్టి ఫామ్‌ కొనుక్కోవాల్సిన అవసరం లేదని.. కేవలం ఓ వైట్‌ పేపర్‌లో రాసి ఇస్తే చాలంటున్నారు.

రేషన్ కార్డు దరఖాస్తు ఫాములన్నీ ఫేక్
X

తెలంగాణలో రేషన్‌ కార్డుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనాలు కూడా 6 గ్యారంటీల ఫామ్‌తో దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన 6 గ్యారంటీల ఫామ్‌తో పాటు రేషన్‌ కార్డు దరఖాస్తు ఫామ్‌ అంటూ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ ఫామ్‌ అచ్చం 6 గ్యారంటీల ఫామ్‌ను పోలి.. సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలతో ఉంది. దీంతో చాలామంది ఈ ఫామ్‌ కూడా ఒరిజినల్ ఫామే అనుకున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదే అదునుగా భావించిన జిరాక్స్ షాపు నిర్వాహకులు వేలల్లో ప్రింట్లు తీసి అమ్మడం మొదలుపెట్టారు. జనం కూడా వాటిని కొనుక్కుని, నింపి ప్రజాపాలనలో అధికారులకు ఇస్తున్నారు. అధికారులు కూడా వాటిని తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు కూడా చాలామంది దగ్గరుండి జనాన్ని ప్రోత్సహిస్తున్నారు. రేషన్‌ కార్డు దరఖాస్తు ఫామ్ నింపి ఇవ్వాలని చెబుతున్నారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అసలు ఆ రేషన్‌కార్డు దరఖాస్తు ఫామ్‌తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రేషన్‌ కార్డు కోసం ప్రత్యేకించి ఎలాంటి దరఖాస్తు ఫామ్ రిలీజ్ చేయలేదంటున్నారు. అయితే ఇప్పటికే రేషన్‌ కార్డుల కోసమని లక్షలాది మంది ఈ ఫామ్‌తో దరఖాస్తు చేసుకున్నారు. అప్లయ్‌ చేసినవాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు అధికారులు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. కాకపోతే ఇకనుంచి డబ్బులు పెట్టి ఫామ్‌ కొనుక్కోవాల్సిన అవసరం లేదని.. కేవలం ఓ వైట్‌ పేపర్‌లో రాసి ఇస్తే చాలంటున్నారు.

సమాచార లోపంతో ఈ సమస్య తలెత్తింది. 4 రోజులుగా జనాల చేతుల్లో ఈ ఫాములు కనిపించినా అటు అధికారులు గానీ, ఇటు ప్రభుత్వం గానీ స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది. మొత్తానికి ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. ఫామ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది కాకపోయినప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పడంతో అప్లయ్ చేసిన వాళ్లంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

First Published:  2 Jan 2024 12:56 PM IST
Next Story