Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు.. ఎన్నికల నాటికి ఏమవుతుందో.!

రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు.. ఎన్నికల నాటికి ఏమవుతుందో.!
X

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చాలా జోష్‌లో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచే.. తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూనే.. పార్టీ బలోపేతానికి పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే.. తనదైన వ్యూహాలతో కాంగ్రెస్‌ పునరుజ్జీవం కోసం కష్టపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ కూడా గతంలో సీఎం కేసీఆర్ చేసిన తప్పులనే చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 60 పైగా సీట్లు గెలుచుకొని బొటాబొటి మెజార్టీతో అధికారం చేపట్టింది. అప్పటి వరకు ఉన్న ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చే క్రమంలో కేసీఆర్ తనదైన శైలిలో దూసుకొని పోయారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్నారు. పక్కలో బల్లెం మాదిరిగా ఉన్న చంద్రబాబు నాయుడికి మరో అవకాశం ఇవ్వకుండా.. హైదరాబాద్ నుంచి బాబు మకాం మార్చేలా చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా బలం పుంజుకున్నది. 2018లో ముందస్తుకు వెళ్లి మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. అయినా సరే ఆగకుండా ఇతర పార్టీల నుంచి వలసలు పెంచారు. అలా ఎంతో మంది నాయకులు పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అయితే, పార్టీ బలం పెంచుకొని.. కాంగ్రెస్, టీడీపీలను బలహీనపరిచే క్రమంలో కేసీఆర్ వలస నాయకులను ప్రోత్సహించడంతో కొన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలతో ముఠాలు ఏర్పడ్డాయి. ప్రతి నిత్యం గ్రూపు తగాదాలతో కేసీఆర్‌కు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. జూపల్లి కృష్ణారావు - బీరం హర్షవర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి - రోహిత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియ - కోరం కనకయ్య, సండ్ర వెంకటవీరయ్య - పిడమర్తి రవి, సబిత ఇంద్రారెడ్డి - తీగల కృష్ణారెడ్డి, చిరుమర్తి-వేముల మధ్య విభేదాలు నెలకొన్నాయి. వీరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా.. రెండో వర్గం వారిని ఓడించడానికి సిద్ధంగా ఉంది. ఒకే పార్టీలో ఇద్దరు నేతల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 10కి పైగా సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్‌లోకి ప్రోత్సహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, విజయారెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, కాంతారావు, బోడ జనార్దన్, రావి శ్రీనివాస్, ఎర్ర శేఖర్, బాలు నాయక్ అంతా కాంగ్రెస్‌లో చేరారు. గతంతో వీళ్లు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు వ్యతిరేకంగా పని చేశారు. చాలా చోట్లు వీళ్లకు పాత కాంగ్రెస్ నాయకులతో పొసగడం లేదు. ఇప్పటికే తాము కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తామని చెప్పుకొని తిరిగిన నేతలు.. వీరి రాకతో అయోమయంలో పడ్డారు.

పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఇస్తే తాము సహకరించమని ఏకంగా రేవంత్ రెడ్డికే చెప్పినట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే రేవంత్ ఒక క్లారిటీకి వచ్చారని, తన జాబితాను కచ్చితంగా అధిష్టానం వద్ద ఒప్పించుకుంటారని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో కొత్త వారికి టికెట్లు ఇస్తే.. పాత నాయకులు తిరుగుబాటు చేస్తారనే ఆందోళన నెలకొంది. రేవంత్ కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించే ముందు ఆయా నియోజవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులతో చర్చిస్తే.. ఈ వివాదాలకు పుల్‌స్టాప్ పడే అవకాశముందని అంటున్నారు. మరి రేవంత్ ఆ దిశగా ఆలోచిస్తారా? లేదా తన పాత పరిచయాలతో ఇతర పార్టీ వారిని దూకుడుగా చేర్చుకుంటారా అని కార్యక్తర్తలు ఎదురు చూస్తున్నారు.

First Published:  15 July 2022 3:51 PM IST
Next Story