Telugu Global
Telangana

మునుగోడు హుజూరాబాద్ కాదు..!

మునుగోడు హుజూరాబాద్ కాదు, దుబ్బాక కాదు. ఆ రెండు ఉప ఎన్నికలకు మునుగోడుకు చాలా తేడా ఉంది. హుజూరాబాద్, దుబ్బ్బాక ఉపఎన్నికలకు కారణాలు, ఆ రెండు నియోజకవర్గాలలో ప్రభావం చూపిన అంశాలు, ఫలితాలను నిర్ధారించిన పరిస్థితులు వేరు.

మునుగోడు హుజూరాబాద్ కాదు..!
X

మునుగోడు ఉపఎన్నిక అనివార్య పరిస్థితుల్లో వచ్చినది కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన కారణంగా వచ్చిపడ్డ బలవంతపు ఎన్నిక. కనుక ఎలాంటి ఎజెండా లేకుండా, ప్రజలు కోరుకోకుండా వారిపై రుద్దిన ఎన్నిక. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రూ.18,000 కోట్ల బొగ్గు కాంట్రాక్టు పొందినందుకే బీజేపీ కోరిక మేరకు రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమయ్యారన్న అంశం ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఆ విషయంలో టీఆర్ఎస్ విజయం సాధించగలిగింది. అలాగే తాను ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో సహేతుక కారణాలు వివరించి ప్రజల్ని కన్విన్సు చేయడంలో కోమటిరెడ్డి విఫలమయ్యారు. ఈ సంగతి బీజేపీ ప్రముఖులు కూడా ఆఫ్ ది రికార్డులో ఒప్పుకుంటున్నారు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు ఎదురు పడినా అడుగుతున్న ప్రశ్న ' మునుగోడు లో ఎవరు గెలుస్తారు..? అని. అంత తారాస్థాయికి చేరుకుంది రాజకీయం. మరి అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఉపఎన్నికలో చిత్రవిచిత్రాలు తారసపడుతున్నాయి. అందులో ప్రధానమైనది కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ ఆడియో. ఆస్ట్రేలియా నుంచి ఈ వీడియో విడుదలైంది. ఉద్దేశపూర్వకంగానే ఆ ఫోన్ కాల్ ఆడియోలను ఆస్ట్రేలియాలో తాను మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా..? ఏమిటి మర్మం..?? దీనివల్ల ఎవరికి లాభం.? కోమటిరెడ్డి బ్రదర్స్ మైండ్ గేమ్ ఏమిటి..? అయితే అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన 'వ్యవహారాలన్నీ'తమ్మునికి లాభం చేకూర్చుతాయనుకుంటే అది భ్రమ!

మునుగోడు ఎన్నిక తెలంగాణ‌లో ఇంతవరకు జరిగిన ఇతర ఉప ఎన్నికలతో పోలిస్తే చాలా విభిన్నమైనది. ఎవ్వరూ కోరుకోని, ఊహించని ఉప ఎన్నికిది. అందుకే ప్రజలు సైతం ఆచి, తూచి వ్యవహరిస్తున్నారు. ఓటు ఎవరికి వేయాలో వారికి స్పష్టంగా తెలిసినా.. రాజకీయ పార్టీల ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడే కోమటిరెడ్డి బ్రదర్స్ 'అతి తెలివి'గా ఆలోచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని పథక రచన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ గెలవాలంటే కాంగ్రెస్ ను 'బలహీన పరచాలని' కోమటిరెడ్డి బ్రదర్స్ అనుకున్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ను దెబ్బతీయడం మినహా ఆ సోదరులకు మరో మార్గం కనిపించలేదు. కొంత బీజేపీ పుంజుకున్నా, అది గెలుపునకు సరిపడే శక్తి కాదని బ్రదర్స్ కు తెలుసు. పైగా ప్రజాక్షేత్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద వ్యతిరేకత వ్యక్తం కావడం వారికి మింగుడు పడలేదు. ఊహించని విధంగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి రాజగోపాల్ రెడ్డి నిరసన సెగలను ఎదుర్కున్నారు. కాంగ్రెస్ ను చంపి నిర్వీర్యం చేసే బాధ్యతను ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన భుజాలకు ఎత్తుకున్నాడు. టీఆర్ఎస్ ను నిలువరించి బీజేపీని గెలిపించడం కోసం కాంగ్రెస్ ను క్రమంగా చంపాలన్న ఆలోచన నుంచి పుట్టుకు వచ్చిందే ఈ ఫోన్ కాల్ వీడియో, ఆడియోల రిలీజ్ తతంగం. అన్న కోమటిరెడ్డి మద్దతు తనకున్నదని చెప్పడం ఒక కోణం అయితే కాంగ్రెస్ బలహీనపడుతుందని ఆ పార్టీ ఎంపీ చెప్పడం ద్వారా బీజేపీకి లబ్ధి చేకూర్చే కుట్ర మరొక కోణం. అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ పనికి పూనుకున్నారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చంపి తన సోదరుని గెలిపించేందుకు వ్యూహం పన్నాడు.

ఏమి చేసినా కాంగ్రెస్ గెలవదని తాను ప్రచారానికి వెళ్లినా 10 వేలకు మించి ఓట్లు పెరగవని చెప్పడం అంటే వెంకట్ రెడ్డి ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. మునుగోడు పబ్లిక్ టాక్ ప్రకారం అక్కడ టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. తమ సీటు కోల్పోతే పరువు పోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకే పరువు దక్కించుకోవాలన్న పట్టుదల కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తుంది. అయితే నాయకత్వలేమి, నాయకుల మధ్య విబేధాలు కాంగ్రెస్ ను పట్టిపీడిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా అనేకమంది కాంగ్రెస్ నాయకుల అయోమయ స్థితి ఆ పార్టీని ఓటమి అంచుల్లోకి నెట్టింది. ఇక ఏమాత్రం పట్టులేని బీజేపీ మునుగోడులో గెలవాలంటే వక్రమార్గం తప్ప మరో దారి కనిపించలేదు. కమ్యూనిస్టుల ఖిల్లా మునుగోడులో బలమైన టీఆర్ఎస్ మీద గెలవాలంటే కాంగ్రెస్ ను చంపడమే మార్గమని భావించిన కోమటిరెడ్డి సోదరులు ఈ ఆడియో, వీడియోలను ప్రపంచం మీదికి వదిలారు. వీటిని విన్న కాంగ్రెస్ కార్యకర్తలు గెలవని తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం వృథా అని భావిస్తారనేది కోమటిరెడ్డి సోదరుల దురాలోచన.

అదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని వెంకటరెడ్డి కోరుతున్నట్టు మరొక ఆడియో రిలీజ్ చేయడం కూడా తన మద్దతు తన సోదరుడికి ఉందని చెప్పాలనేది మరో దుర్బుద్ధి. అందుకే పదేపదే కాంగ్రెస్ గెలవదని పార్టీలకతీతంగా రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరుతున్నాడు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు, రాజకీయాల్లో విలువలు తగ్గిపోవడం పట్ల అసహ్యించు కుంటున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి సోదరుల ఎత్తులు గమనిస్తున్న ప్రజలు ఈ ఎన్నికల్లో గుణాత్మకమైన మార్పు ఇచ్చే ఓటర్ల తీర్పుగా ఉండే అవకాశం కనిపిస్తుంది.

తెలంగాణ రాజకీయ చిత్రపటంలో మునుగోడు ఎరుగని ప్రాముఖ్యతని సంతరించుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మరో ప్రతిపక్షమైన బీజేపీ నుంచి పోటీ చేస్తానంటూ దిగిన కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి జీవితంలో ఎప్పుడు తెలియని విధంగా శ్రమించి పోరాడాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీటే కదా పోతే పోయిందని సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేయలేదు. కేంద్రంతో నేరుగా పోరాడుతూ ఉన్న కేసీఆర్ తన బలప్రదర్శనకు మునుగోడును వేదికగా చేసుకున్నారు. టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు యావత్తు బలగాలను మునుగోడులో మోహరించారు. ప్రతీ రెండు వేల ఓటర్లకు ఒక ప్రతినిధిని నియమించారు‌. చివరికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను గ‌ట్టుప్పల్ మండలానికి ఇంఛార్జ్ గా నియమించారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా 2018లో 97 వేల ఓట్లు సాధించి రాజ‌గోపాలరెడ్డి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలు, అధికార పార్టీలోకి వెళ్లిపోయిన కొందరు ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్‌ ను సంస్థాగతంగా బలహీనపరచినవి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కావాలనుకున్నారు. ఆ పదవి రేవంత్ రెడ్డికి వరించింది. బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీ స్థాపిస్తున్న కేసీఆర్ ను కట్టడి చేయడానికి గాను మునుగోడు తమకు అస్త్రంగా లభించినట్టు బీజేపీ భావిస్తుంది. మొదట ఖమ్మం జిల్లా నుంచి ఉపఎన్నిక కోసం బీజేపీ ఒక పథకాన్ని రచించింది. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో మునుగోడును ఎంపిక చేశారు. మునుగోడులో గెలిస్తే నల్గొండ జిల్లాలో బీజేపీ తిరుగులేని పార్టీగా మారవచ్చునని అనుకుంటున్నారు.

రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిన నాటివరకు టీఆర్ఎస్ 7 నుంచి 8 శాతం ముందంజలో ఉంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో గౌడ సామాజికవర్గంలో టీఆర్ఎస్ కు కొంత దెబ్బ తగలవచ్చు. అందుకు కౌంటర్ గా దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్‌లను చేర్చుకోవడం వల్ల టీఆర్ఎస్ కు పెద్దగా మేలు జరగకపోవచ్చు. ఈ చేరికలను మునుగోడు ప్రజలతో పాటు రాష్ట్రం కూడా మర్నాడే మర్చిపోయింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నా పద్మశాలి సామాజికవర్గాన్ని ప్రభావితం చేసే శక్తి ఆయనకు లేదు.

రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరేలోపే తన పాత కాంగ్రెస్ క్యాడర్‌ని తనతో పాటు లాగేశారని బీజేపీ నాయకుల అంచనా. పోలింగ్ బూత్‌స్థాయి కార్యకర్త నుంచి, మండల స్థాయి నాయకుల వరకు దాదాపు 80 శాతం కాంగ్రెస్ క్యాడర్ ను తన వైపునకు తిప్పుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకుల వాదన. కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్ర‌వంతిని అభ్యర్థిగా ప్రకటించే నాటికే జరగరాని నష్టం జరిగిపోయింది. రాజ‌గోపాలరెడ్డి గతంలో తనకు పడ్డ 97 వేల ఓట్లలో ఎంత శాతం తిరిగి 'స్థిరీకరణ' చేసుకున్నారో స్పష్టం కావలసి ఉంది. 2018 లో బీజేపీ సాధించుకున్న ఓట్లు 12 వేల పైచిలుకు మాత్రమే. కాంగ్రెస్‌‌ నుంచి తరుగుతున్న గ్రాఫ్ కేవలం బీజేపీకే కలిసిరావచ్చు.

పెన్షనర్లు, కురువృద్ధులు, వ్యాపారులు, రైతులు, ఇతర సంక్షేమ పథకాల లబ్దిదారులంతా కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్నట్టు పలు సర్వేలలో వెల్లడైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2014లో 69,496 ఓట్లుతో గెలిచారు. 2018లో 38 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018 నుంచి మునుగోడు టీఆర్ఎస్ క్యాడర్‌లో అసంతృప్తి ఉన్న మాట నిజమే..! కూసుకుంట్లపై కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో వ్యతిరేకత ఉంది. తండ్రి గోవర్ధనరెడ్డి రాజకీయ వారసత్వం చేబట్టి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మొదట చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ఆ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహాలకు క్యాడర్ చిన్నాభిన్నం కావడం ఆమెను నిరుత్సాహపరుస్తుంది.

First Published:  1 Nov 2022 2:54 PM IST
Next Story