Telugu Global
Telangana

మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలిచిన సూర్యాపేట జిల్లా ఐపూర్ గ్రామం

ఈ గ్రామంలో మహిళలు 49.4 శాతం ఉన్నారు, వీరి సంఖ్య 3199. గ్రామ పరిపాలనలో మహిళలదే ఆధిపత్యం. 12 వార్డు సభ్యులలో ఏడుగురు మహిళలు. సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు కూడా మహిళలే.

మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలిచిన సూర్యాపేట జిల్లా ఐపూర్ గ్రామం
X

సూర్యాపేట జిల్లాలోని ఐపూర్ అనే చిన్న గ్రామం ఇక నుంచి మహిళా సాధికారతకు జాతీయ మోడల్‌గా పేరుగాంచనుంది.

భారత ప్రభుత్వం నుండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్‌లో భాగంగా ఉత్తమ మహిళా స్నేహపూర్వక గ్రామంగా జాతీయ స్థాయి అవార్డును పొందిందీ గ్రామం.

ఆత్మకూర్ (ఎస్) మండలంలో ఉన్న ఐపూర్ గ్రామం సూర్యాపేట జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామ జ‌నాభా 6,487 .

ఇందులో మహిళలు 49.4 శాతం ఉన్నారు, వీరి సంఖ్య 3199. గ్రామ పరిపాలనలో మహిళలదే ఆధిపత్యం. 12 వార్డు సభ్యులలో ఏడుగురు మహిళలు. సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు కూడా మహిళలే.

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఉండడం, గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా మహిళ కావడం యాదృచ్ఛికం కాదని గ్రామస్తులు అంటున్నారు.

గ్రామ పంచాయతీ మహిళలు, బాలికల కోసం గ్రామంలో బతుకమ్మ ఘాట్, పార్కుతో సహా ప్రత్యేక సౌకర్యాలను అభివృద్ధి చేసింది. అలాగే మహిళలు, బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించేందుకు కరాటే మాస్టర్‌ను నియమించి వారికి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తోంది.

గ్రామంలో 93 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి, వీటిలో 958 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులు గ్రామంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

రూ.3 కోట్లతో ఒక స్వయం సహాయక సంఘం మహిళలు గ్రామంలో మినీ డెయిరీ యూనిట్, మూడు పాల కేంద్రాలను ఏర్పాటు చేసి లాభాలు గడిస్తున్నారు.

మరికొందరు స్వయం సహాయక సంఘం మహిళలు గ్రామంలో బూడిద ఇటుక తయారీ యూనిట్, ఆయిల్ మిల్లు, వస్త్ర దుకాణం, ప్రొవిజన్స్ స్టోర్‌ను కూడా నడుపుతున్నారు.

లింగనిర్ధారణతో కూడిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆత్మరక్షణలో మెలకువలపై శిక్షణ ఇవ్వడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంపై దృష్టి సారించామని అయిపూరు సర్పంచ్ సానబోయిన రజిత అన్నారు. .

ఉత్తమ మహిళా-స్నేహపూర్వక స్థానిక సంస్థగా ఎంపికైనందున‌ గ్రామ పంచాయతీకి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్న రజిత, ఆ సొమ్ముతో గ్రామంలో మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలోని మహిళల ఐక్యతే ఈ అవార్డుకు కారణమని ఆమె పేర్కొన్నారు.

మహిళా సాధికారత సాధించడంలో ఆర్థిక స్వావలంబన కీలకమని పేర్కొంటూ, రాష్ట్ర, కేంద్ర పథకాలన్నింటిని మరింత మెరుగ్గా అమలు చేసి గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు తాము కృషి చేశామన్నారు.

First Published:  9 April 2023 7:22 PM IST
Next Story