Telugu Global
Telangana

అప్పటి బొక్కల దవాఖానా.. నేడు దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పునర్నిర్మాణం

'నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్' పేరుతో 1969 డిసెంబర్ 22న నిమ్స్ ప్రారంభం అయ్యింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎం. రంగారెడ్డి తొలి సూపరింటెండెట్‌గా వ్యవహరించారు.

అప్పటి బొక్కల దవాఖానా.. నేడు దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పునర్నిర్మాణం
X

బొక్కల దవాఖాన అంటే ఈ తరంలో ఎవరికీ అదెక్కడి ఆసుపత్రో అర్థం కాదు. కానీ పాత తరం వాళ్లు మాత్రం బొక్కల దవాఖాన పేరు చెప్తే టక్కున గుర్తు పడతారు. అదే 'నిమ్స్' ఆసుపత్రి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందాలంటే నిమ్స్ ఆసుపత్రి మాత్రమే పెద్ద దిక్కు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు కూడా స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నా.. నిమ్స్‌కు రావడానికికే చాలా మంది మొగ్గు చూపేవారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా.. కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించిన ఘనత నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌దే.

1955లో నిజాం ట్రస్ట్ కింద ప్రభుత్వం ఈ ఆసుపత్రికి స్థలం కేటాయించింది. మొదట్లో ఇక్కడ కేవలం ఆర్థోపెడిక్ సేవలు మాత్రమే అందించే వారు. 'నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్' పేరుతో 1969 డిసెంబర్ 22న నిమ్స్ ప్రారంభం అయ్యింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎం. రంగారెడ్డి తొలి సూపరింటెండెట్‌గా వ్యవహరించారు. నిజాం ట్రస్ట్ ఈ ఆసుపత్రిని ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి అప్పగించే వరకు ఆయనే సూపరింటెండ్‌గా ఉన్నారు. కాగా, నిమ్స్ ఆసుపత్రిని 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం సేవల పరంగా మరింత మెరుగుపరిచింది.

2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌కు నిమ్స్‌లోనే వైద్యం అందించారు. అప్పట్లోనే నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న అరకొర వసతులను కేసీఆర్ గమనించారు. అందుకే నిమ్స్ అభివృద్ధి కోసం రూ.100 కోట్లను ప్రతీ ఏటా కేటాయించి.. అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతీ ఏటా నిధులు విడుదల అవుతూనే ఉన్నాయి. 2014-15లో రూ.185 కోట్లు కేటాయించగా.. 2022లో రూ.242 మంజూరు చేశారు. ప్రతీ ఏడాది ఈ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో భారీగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.

2,000 పడకలతో 'దశాబ్ది బ్లాక్'ను నిర్మించనున్నారు. దీనికి బుధవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే.. దేశంలోనే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద హాస్పిటల్ బిల్డింగ్‌గా రికార్డు సృష్టించనున్నది. ప్రస్తుతం 1,489 బెడ్లు ఉండగా.. నిర్మాణం అనంతరం 3,489 బెడ్లకు చేరుకోనున్నది. 33 ఎకరాలు కేటాయించగా.. కొత్త బిల్డింగ్ నిర్మాణం, ఇతర వసతుల కోసం రూ.1,571 కోట్ల వ్యయం కానున్నది.

First Published:  14 Jun 2023 7:20 AM IST
Next Story