2,715 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ క్లాస్ రూమ్స్.. ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఇకపై తరగతి గదుల్లోనే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) లను భిగించాలని నిర్ణయించింది. ఈ ప్యానల్స్‌ను ఒక టీవీ లాగా ఉపయోగిస్తూనే.. దానిపై ఏర్పాటు చేసే స్లైడర్స్‌ను బ్లాక్/గ్రీన్ బోర్డులుగా యూజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల్లో స్మార్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతగా 'మన ఊరు - మన బడి' కింద ఎంపిక చేసిన 2,715 ఉన్నత పాఠశాలల్లో ఈ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందిస్తున్నా.. అది పూర్తి స్థాయిలో సాధ్యం కావడం లేదు. ఒక గదిలో పాఠాలు బోధించి.. మరో గదిలో ఉన్న కంప్యూటర్ దగ్గరకు వెళ్లి డిజిటల్ పాఠాలను చూపించాల్సి వస్తోంది. దీంతో పూర్తి స్థాయి డిజిటల్ విద్య సాధ్యం కావడం లేదు.
అందుకే ఇకపై తరగతి గదుల్లోనే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) లను భిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్యానల్స్‌ను ఒక టీవీ లాగా ఉపయోగిస్తూనే.. దానిపై ఏర్పాటు చేసే స్లైడర్స్‌ను బ్లాక్/గ్రీన్ బోర్డులుగా యూజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు అవసరం అయితే యానిమేషన్ వీడియోలు చూపించి.. మరింత స్పష్టంగా పాఠాలు బోధించవచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచే 8,9,10వ తరగతి విద్యార్థులకు ఐఎఫ్‌పీ ద్వారా పాఠాలు నేర్పించనున్నారు. ఈ ప్యానల్స్ భిగించాలంటే ఒక్కో పాఠశాలకు రూ.9 లక్షల వరకు ఖర్చు అవుతుంది. జూన్ 12 నాటికి 2,715 పాఠశాలల్లో ప్యానెల్స్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు పూర్తి స్థాయి డిజిటల్ క్లాస్ రూమ్స్ అందుబాటులోకి తేవాలని అధికారులకు విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లోని తరగతి గదుల్లో 75 అంగులాల ఐఎఫ్‌పీ స్క్రీన్స్‌ను అమర్చనున్నారు. దానిపైన మెటల్ స్లైడర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ స్లైడర్స్ పక్కకు జరిపితే టీవీ కనిపిస్తుంది. టీవీలను విద్యార్థులు ముట్టుకోకుండా, పగులకుండా ఈ స్లైడర్స్ కాపాడతాయి. ప్రతీ సారి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు చూపించడానికి వేరే గదుల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. టీచర్లు ప్రత్యేకంగా బొమ్మలు గీయాల్సిన పని కూడా ఉండదు. దీని వల్ల సమయం చాలా వరకు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ స్క్రీన్స్‌ను పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒక రకంగా దీన్ని కంప్యూటర్‌గా కూడా యూజ్ చెయ్యవచ్చు. ఆన్‌లైన్ పాఠాలు బోధించడానికి కూడా వాడుకోవచ్చు. ఎక్కడో ఉండే సబ్జెక్ట్ నిపుణులు జూమ్ ద్వారా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే వీలుంటుంది. ఇంటర్నెట్ నుంచి అవసరమైన పాఠాలను కూడా డౌన్ లోడ్ చేయవచ్చని అధికారులు వివరించారు. ఈ ప్యానెల్స్ అందుబాటులోకి రావడం వల్ల పూర్తి స్థాయి డిజిటల్ క్లాస్ రూములుగా మారిపోతాయని ప్రభుత్వం పేర్కొన్నది.