Telugu Global
Telangana

నిజామియా అబ్జర్వేటరీ పునరుద్దరణకు తెలంగాణ ప్రభుత్వం చేయూత

నిజామియా అబ్జర్వేటరీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నది. తెలంగాణ నేలపై నుంచే వందలాది గ్రహాలు, నక్షత్రాలను గ్రహాలను కనుగొన్న అబ్జర్వేటరీగా దీనికి అరుదైన గుర్తింపు ఉన్నది.

నిజామియా అబ్జర్వేటరీ పునరుద్దరణకు తెలంగాణ ప్రభుత్వం చేయూత
X

నిజామియా అబ్జర్వేటరీ పునరుద్దరణకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక అబ్జర్వేటరీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నది. కొంత మంది ఔత్సాహికులు ఈ అబ్జర్వేటరీ వద్దకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ అరుదైన అబ్జర్వేటరీని పునరుద్దరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. అబ్జర్వేటరీ పునరుద్దరణకు తగిన చర్యలు తీసుకోవాలని అర్భన్ డెవలప్‌మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు సూచించారు.

నిజామియా అబ్జర్వేటరీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నది. తెలంగాణ నేలపై నుంచే వందలాది గ్రహాలు, నక్షత్రాలను గ్రహాలను కనుగొన్న అబ్జర్వేటరీగా దీనికి అరుదైన గుర్తింపు ఉన్నది. వందేళ్ల క్రితమే ఈ నేలపై నుంచే ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. వేలాది నక్షత్రాలను గుర్తించి వాటి చాయాచిత్రాలు తీశారు. వాటితో ఒక గొప్ప క్యాటలాగ్ కూడా రూపొందించారు.

ఆరవ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలిస్తున్న కాలంలో ఆయన వద్ద ఖుర్షీద్ జా బహదూర్ అనే వ్యక్తి రక్షణ మంత్రిగా పని చేసేవాడు. అతని చిన్న కుమారుడు నవాబ్ జాఫర్ యార్‌జంగ్ బహదూర్ ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. అక్కడ ఆస్ట్రానమీ చదువుతున్న కాలంలో టెలీస్కోప్‌లపై మక్కువ పెంచుకున్నాడు. ఏనాటికైనా హైదరాబాద్‌లో గొప్ప అబ్జర్వేటరీ నిర్మించాలని సంకల్పించుకున్నాడు.

చదువు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఎనిమిది అంగులాల కూకీ ఆస్ట్రాగ్రాఫ్, 15 అంగులాల గ్రబ్ రిఫ్లెక్టర్ టెలిస్కోప్‌లను నగరానికి తీసుకొని వచ్చాడు. 1908లో వాటిని తీసుకొని వచ్చి 'పిసల్ బండ'లో తొలి అబ్జర్వేటరీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమీర్‌పేటకు మార్చారు. అప్పట్లోనే ఇంగ్లాండ్ ఖగోళ పరిశోధకుడు అయిన ఛాట్ వుడ్‌ను తొలి డైరెక్టర్‌గా నియమించారు. ఆయన మరణానంతరం దీన్ని ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగించారు. అయితే నగరంలో రద్దీ పెరుగుతుండటంతో 1968లో ఈ అబ్జర్వేటరీని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జాపాల్ రంగాపూర్ గ్రామంలోని ఒక కొండపైకి తరలించారు.

అయితే తొలుత ఏర్పాటు చేసిన అబ్జర్వేటరీపై పూర్తి నిర్లక్ష్యం వహించడంతో అది శిథిలావస్థకు చేరుకున్నది. సరిగ్గా ప్రగతిభవన్ వెనుక ఉండే ఈ అబ్జర్వేటరీనే పునరుద్దరించాలని కోరడంతో మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. రాబోయే కాలంలో ఈ అబ్జర్వేటరీని మంచి ఆస్ట్రానమీ సెంటర్‌గా మార్చే అవకాశం ఉన్నది.


First Published:  16 May 2023 4:45 PM IST
Next Story