వర్షాలు, వరదల నష్టంపై కేంద్రాన్ని సాయం కోరుతాం.. హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరా పునరుద్దరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నష్టంపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేస్తోంది. ఈ నివేదిక సిద్ధం అయిన వెంటనే సాయం కోసం కేంద్రానికి పంపుతామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరదలకు సంబంధించిన అంశంపై న్యాయవాది చెరుకు సుధాకర్ వేసిన పిల్‌పై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించింది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఈ నివేదికను హైకోర్టుకు అందజేసి.. వరద బాధితులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరా పునరుద్దరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను ఆధారంగా తీసుకొని భారీ వర్షాలపై అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాము. భారీ వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, రెండు హెలికాప్టర్లను పంపించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని పంపించాము. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించాము. బాధితుల సహాయార్థం ముందుగానే వరద బాధిత జిల్లాల్లో సహాయక శిబిరాలు, వైద్య, ఆహార ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు సెక్రటేరియట్‌లో 24 గంటల పాటు పని చేసేలా ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించింది. దీని ద్వారా అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు, సాయం అందించామని పేర్కొన్నది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 11,748 మందిని 177 సహాయక కేంద్రాలకు తరలించామని.. కేంద్ర, రాష్ట్ర, స్థానిక వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేసినట్లు రాహుల్ బొజ్జ ప్రభుత్వం తరపున హైకోర్టుకు వివరించారు. ఇప్పటి వరకు వరదల కారణంగా ఆచూకీ లేకుండా పోయిన వారు ఎవరూ లేరని.. కానీ ఇప్పటికీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపడుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది.