Telugu Global
Telangana

'అభయ హస్తం' పేరుతో సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేయనున్న తెలంగాణ కాంగ్రెస్

'అభయహస్తం' పేరుతో సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నది. ఈ సభకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

అభయ హస్తం పేరుతో సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేయనున్న తెలంగాణ కాంగ్రెస్
X

తొమ్మిదేళ్లుగా ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది. దక్షిణాదిలో కూడా పార్టీ ఇక తుడిచిపెట్టుకొని పోతుందని అనుకున్న సమయంలో.. కర్ణాటక ఎన్నికలు పార్టీకి ఊపిరిలూదింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటతామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు సంబంధించి తొమ్మది డిక్లరేషన్లు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టాలంటే.. గత తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మించి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే వరంగల్‌లో రైతు డిక్లరేషన్, సరూర్‌నగర్‌లో యూత్ డిక్లరేషన్ చేసింది. ఒకటి రాహుల్ గాంధీతో, రెండోది ప్రియాంక గాంధీతో ప్రకటింపచేశారు. అయితే డిసెంబర్‌లో ఎన్నికలు ఉండటంతో ఆ లోపు మిగిలిన 7 డిక్లరేషన్లు ప్రకటించాలని టీపీసీసీ నిర్ణయించింది. ప్రతీ 25 రోజులకు ఒక డిక్లరేషన్ చొప్పున విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక అన్ని డిక్లరేషన్లు కలిపి.. 'అభయహస్తం' పేరుతో సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నది. ఈ సభకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ముగ్గురు కలిసి ఒకే సారి తెలంగాణ రావడం ఇదే మొదటి సారి కానున్నది. సెప్టెంబర్ 17 హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనం అయిన రోజు. కాబట్టి ఆ రోజు మేనిఫెస్టో విడుదల చేస్తే బాగుంటుందని టీపీసీసీ భావిస్తోంది. ఈ సభలో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ సీఎంలు కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాబోయే రోజుల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ, సంక్షేమ, పాలన డిక్లరేషన్లు ప్రకటించనున్నారు. హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన ఉమ్మడి జిల్లాల్లో ఈ డిక్లరేషన్ల ప్రకటన ఉంటుంది. మహిళా డిక్లరేషన్‌ను మేడారంలో ప్రకటించే అవకాశం ఉన్నది. సమ్మక సారలమ్మ అంటే తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉన్నది. అందుకే మహిళా డిక్లరేషన్‌ను అక్కడ ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇక ఎస్సీ డిక్లరేషన్‌ను మల్లిఖార్జున్ ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం నాగర్‌కర్నూల్ లేదా మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక సభ ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హడావిడికి తెరలేపిందనే తెలుస్తున్నది. వరుసగా డిక్లరేషన్లు విడుదల చేస్తూ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నది.

First Published:  20 May 2023 8:50 AM IST
Next Story