కేసీఆర్ జాతీయ పార్టీకి టీమ్ రెడీ..!
జాతీయ పార్టీ టీమ్‌ను కేసీఆర్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఈ టీమ్ అంతా ఢిల్లీలోని ఆఫీసు నుంచి కార్యక్రమాలు చక్కబెట్టనున్నది.
కేంద్రంలోని బీజేపీ, మోడీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. ఫ్రంట్‌లతో పనికాదని, జాతీయ పార్టీనే సరైన పరిష్కారం అని భావించిన కేసీఆర్.. చాలా రోజులుగా ఈ విషయంపై కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్నానని.. దేశ దశ, దిశను మార్చే అవకాశం తెలంగాణకు వచ్చిందని ప్రజలకు విన్నవించారు. ఈ క్రమంలో అనేక మంది జాతీయ నాయకులను కూడా కలిశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీ(ఎస్) నేత కుమార స్వామిని కలిశారు. తాజాగా గుజరాత్ మాజీ సీఎం ఎస్ఎస్ వాఘేలాతో కూడా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం ఖాయమే అని, దసరా రోజు దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
వాఘేలాతో సమావేశం సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంగా ఉంటూనే.. దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తానని చెప్పారు. అంటే 2023 తర్వాత కూడా కేసీఆర్ రాష్ట్రానికే పరిమితం అవుతారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఒక కోర్ టీమ్‌ను ఏర్పాటు చేసి పార్టీని నడిపిస్తారని తెలుస్తున్నది. ఇప్పటికే జాతీయ పార్టీ టీమ్‌ను కేసీఆర్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఈ టీమ్ అంతా ఢిల్లీలోని ఆఫీసు నుంచి కార్యక్రమాలు చక్కబెట్టనున్నది. రాజధానిలో పార్టీ కార్యాలయ నిర్మాణం నుంచి కేసీఆర్ జాతీయ పర్యటనలు, సమావేశాలు అన్నింటినీ ఈ కోర్ టీమ్ పర్యవేక్షిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఢిల్లీలో పార్టీ ఆఫీస్ నిర్మాణం పూర్తవుతుందని.. అప్పటి నుంచి కేసీఆర్ టీమ్ అక్కడే ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
టీఆర్ఎస్ వర్గాల సమాచారం మేరకు.. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ఎస్. మధుసూదనా చారి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, రాజ్యసభ సభ్యులు డి. దామోదర్ రావు, కేఆర్ సురేశ్ రెడ్డి, లోక్‌సభ సభ్యులు నామా నాగేశ్వరరావు, కొత్తా ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు జాతీయ పార్టీ కోర్ టీమ్‌గా కేసీఆర్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దసరా రోజు ఈ టీమ్‌ను ప్రకటిస్తారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీలోని కొత్త టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి ఈ నాయకులు ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేస్తారు. అలాగే కేసీఆర్‌తో ఇతర ముఖ్య నాయకుల భేటీలను కూడా వీళ్లు ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీకి సంబంధించిన ప్రతీ టూర్‌ను ఈ టీమ్ రూపొందించనున్నది. రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీకి, జాతీయ పార్టీకి మధ్య సమన్వయం ఉండేలా కూడా ఈ టీమ్ జాగ్రత్తలు తీసుకోనున్నది. జాతీయ పార్టీ ముందుగా గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టనున్నది. కేసీఆర్ ఇచ్చే సూచనల మేరకు ఆయా రాష్ట్రాల్లో పార్టీ వ్యూహాలను ఈ టీమ్ అమలు చేయనున్నది. ప్రతీ రాష్ట్రంలోని బీజేపీయేతర పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం ప్రధాన లక్ష్యంగా ఉండబోతున్నది.
2024 సార్వత్రిక ఎన్నికల వరకు కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించిన పర్యటనలు ఉంటాయని తెలుస్తోంది. కేసీఆర్ కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెడతారని.. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత తిరిగి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు పూర్తిగా సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి సీఎం కేసీఆర్ మాత్రం అనుభవంతో పాటు దూకుడు కలిగిన నాయకులను సిద్ధం చేస్తున్నట్లు మాత్రం అర్థం అవుతోంది.