నేటి నుంచి రెండో దశ సమగ్ర కుటుంబ సర్వే
మొత్తం 76 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిపై వివరాలు సేకరించనున్న ఎన్యుమరేటర్లు
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి రెండో దశ సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. మొదటి దశలో భాగంగా మూడు రోజుల పాటు కుటుంబాలను గుర్తించిన సిబ్బంది ఇండ్లకు స్టిక్కర్లు వేశారు. ప్రస్తుతం ఆ కుటుంబాల్లోని సభ్యుల వివరాలను నమోదు చేయనున్నారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారనేది మొదలుపెట్టి ఆయా కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం వంటి అంశాలతో సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ నిర్వహిస్తున్న ఈ సర్వేలో 87 వేల మంది ఎన్యుమరేటర్లు పాల్గొననున్నారు. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒకరి చొప్పున 8,500 మంది పర్యవేక్షకులు ఉంటారు. మొత్తం 76 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని కుటుంబసభ్యుల ముందు ఉంచి వారి నుంచి వివరాలు సేకరిస్తూ సర్వే చేస్తారు. సెలవు రోజుల్లోనూ సర్వే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్యుమరేటర్లకు స్పష్టం చేసింది. వివరాలన్నీ సాయంత్రం ఆరు గంటలకు ప్రణాళిక శాఖకు చేరవేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సర్వేను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.