Telugu Global
Telangana

తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు ప్రధాని మోడీ పాలించిన గుజరాత్‌లో కూడా లేవు : మంత్రి జగదీశ్ రెడ్డి

స్వరాష్ట్రం ఇంతలా అభివృద్ధి చెందడంలో అధికారుల పాత్ర మరువలేనిది అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు ప్రధాని మోడీ పాలించిన గుజరాత్‌లో కూడా లేవు : మంత్రి జగదీశ్ రెడ్డి
X

తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలించిన గుజరాత్ రాష్ట్రంలో కూడా లేవు. కేసీఆర్ పరిపాలన ఎంత ఆదర్శంగా ఉందో తెలుసుకోవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లి చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

స్వరాష్ట్రం ఇంతలా అభివృద్ధి చెందడంలో అధికారుల పాత్ర మరువలేనిది అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రజలు, అధికారులు కలిసి సాధించిన ఫలితాలను ఉత్సవాలుగా జరుపుకొని గుర్తు చేసుకోవడం ఈ సంబరాలకు వన్నె తెచ్చిందని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు వెళితే అక్కడ ఒక్క పూట అన్నం తినే వాళ్లు కనపడతారు. కానీ, తెలంగాణలో ఆకలి కేకలు లేవు, నీళ్ల కరువు లేదు, సంక్షేమానికి కొదువే లేదని మంత్రి చెప్పారు

46 లక్షల మందికి రాష్ట్రంలో వివిధ రకాలైన పెన్షన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు వచ్చే నెల నుంచి రూ.1 వెయ్యి పెంచుతామని కేసీఆర్ చెప్పారు. ఇన్ని రకాల పెన్షన్లు అందజేస్తూ.. ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. పరిశ్రమల దినోత్సవం రోజున యాదాద్రి జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్.. 51 పరిశ్రమలను ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏ రంగం చూసినా మన రాష్ట్రమే ముందు ఉందని, అవార్డుల్లోనూ తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటునే ప్రస్తుతం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్, గర్భిణులకు ఆర్ధిక సహాయం తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసీఆర్‌ ను తలచుకుని సంబరపడుతున్నారని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఎన్నో విజయాలు సాధించాము. సంపద పెంచు.. ప్రజలకు పంచు అనే లక్ష్యంతో కేసీఆర్ సుపరిపాలనను అందించారని ప్రభుత్వ విప్ గొంగడి సునీత అన్నారు.


First Published:  10 Jun 2023 9:38 PM IST
Next Story