Telugu Global
Telangana

తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదల?

అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదల?
X

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు పూర్తి కానున్నది. 2018లో ఎన్నికలు జరిపిన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియనుండటంతో ఎలక్షన్స్ నిర్వహించడానికి ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. రాజకీయ పార్టీల సమాయత్తం పక్కన పెడితే.. ఈసీఐ కూడా ఎన్నికల ప్రక్రియ సన్నాహాలు ఎప్పుడో ప్రారంభించింది.

తెలంగాణలో ఈవీఎం, వీవీ ప్యాట్ల పరిశీలన, శిక్షణ వంటి కార్యక్రమాలు పూర్తి చేసింది. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదు రాష్ట్రాలకు కలిపి ఓకే సారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని భావిస్తున్నారు.

సాధారణంగా ఒక అసెంబ్లీ తొలి సారిగా సమావేశమైన దగ్గర నుంచి ఐదేళ్ల కాలపరిమితిని లెక్కిస్తారు. 2018 డిసెంబర్ 11న తెలంగాణ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయినా.. తొలిసారి 2019 జనవరి 16న అసెంబ్లీ సమావేశం జరిగింది. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి 16 లోగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావల్సి ఉంటుంది. అయితే గతంలో తెలంగాణతో పాటు మిజోరాంకు కూడా ఒకే సారి ఎన్నికలు నిర్వహించారు. దాని అసెంబ్లీ 2023 డిసెంబర్ 17న తొలి సారి కొలువైంది. దీంతో ఈసీఐ దీనినే ప్రామాణికంగా తీసుకొని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఎన్నికల నిపుణులు చెబుతున్నారు.

అసెంబ్లీ గడువు ముగియడానికి 60 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. దీని ప్రకారం మీజోరాం అసెంబ్లీకి అక్టోబర్ 17 కంటే ముందు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. మీజోరాంతో పాటే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 17 కంటే ముందే వెలువడుతుందని తెలుస్తున్నది. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించి.. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేస్తారని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి రెండు నెలల కంటే తక్కువ సమయమే ఉందని అనుకోవచ్చు.

First Published:  8 Aug 2023 1:49 AM GMT
Next Story