ప్రసవాల్లో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల రికార్డు.. దేశంలోనే అగ్రస్థానంలో సర్కారు దవాఖానలు
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 80 శాతం కంటే ఎక్కువ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి. సంగారెడ్డి జిల్లా 87 శాతం ప్రసవాలతో అగ్రస్థానంలో ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. సర్కారు దవాఖానల్లో మౌలిక వసతులు పెంచడంతో పాటు, నిపుణులైన వైద్య సిబ్బందిని కూడా నియమిస్తోంది. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 69 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 80 శాతం కంటే ఎక్కువ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి. సంగారెడ్డి జిల్లా 87 శాతం ప్రసవాలతో అగ్రస్థానంలో ఉన్నది. ఆ తర్వాత నారాయణపేటలో 83 శాతం, మెదక్‌లో 82 శాతం, జోగులాంబ గద్వాల జిల్లాలో 81 శాతం మంది గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు చేయించుకున్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి వాహనాలు వంటి పథకాల వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగాయి. కానీ 2023కు వచ్చే సరికి 69 శాతానికి పెరగడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వసతులు కల్పించడంతో తొమ్మిదేళ్లలోనే ప్రసవాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 70 శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి. హైదరాబాద్ వంటి మహానగరంలో ఎన్నో అత్యాధునిక ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నా.. ఇక్కడ 77 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగడం గమనార్హం. మేడ్చెల్ మల్కాజిగిరిలో 70 శాతం, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో కూడా 70 శాతం నమోదు కావడం గమనార్హం.
ఒకప్పుడు మాతృ మరణాల రేటు 92, శిశు మరణాల రేటు 39గా ఉండేది. అయితే ఈ స్థితిని మార్చాలనే లక్ష్యంతో అనేక చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అయితే కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. బాబు పుడితే రూ.12 వేలు, పాప పుడితే రూ.13 వేలు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా పోషకారహారం, రక్తహీనత నివారణకు న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేస్తోంది. టిఫా స్కానింగ్ యంత్రాల ద్వారా బిడ్డ ఆరోగ్య స్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇవన్నీ అత్యుత్తమ ఫలితాలను ఇస్తున్నాయి.
దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు అత్యధిక ప్రసవాలను నమోదు చేయడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ గొప్ప విజన్ కారణంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 69 శాతానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తితో మరింత ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.
ఏప్రిల్ 2023లో జిల్లాల వారీగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల శాతం..
1. సంగారెడ్డి - 87
2. నారాయణపేట - 83
3. మెదక్ - 82
4. జోగులాంబ గద్వాల - 81
5. నాగర్‌కర్నూలు - 79
6. హైదరాబాద్ - 77
7. వికారాబాద్ - 76
8. ములుగు - 75
9. వనపర్తి - 74
10. భద్రద్రి కొత్తగూడెం - 73
11. కామారెడ్డి - 73
12. సిద్దిపేట - 72
13. జనగామ - 72
14. మహబూబ్‌నగర్ - 71
15. ఆదిలాబాద్ - 71
16. మేడ్చెల్ మల్కాజిగిరి - 70
17. పెదపల్లి - 69
18. కుమ్రం భీం ఆసిఫాబాద్ - 67
19. నిజామాబాద్ - 64
20. మహబూబాబాద్ - 63
21. వరంగల్ - 62
22. హన్మకొండ - 61
23. ఖమ్మం - 60
24. మంచిర్యాల - 60
25. కరీంనగర్ - 59
26. నిర్మల్ - 58
27. జయశంకర్ భూపాలపల్లి - 57
28. రాజన్న సిరిసిల్ల - 57
29. జగిత్యాల - 57
30. నల్గొండ - 57
31. సూర్యపేట - 56
32. యాదాద్రి భువనగిరి - 52
33. రంగారెడ్డి - 48
Telangana government hospitals created history in country with the highest number of deliveries in government hospital.
— Harish Rao Thanneeru (@BRSHarish) May 31, 2023
>80% deliveries in govt hospitals in Sangareddy, Narayanpet, Medak and Jogulamba Gadwal
In 16 districts, 70% of deliveries are registered in government… pic.twitter.com/ksveJIaVFz