ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాఫియాలా తయారయ్యింది... నిర్మాత సీ.కళ్యాణ్ ఆరోపణ
నిర్మాతల మండలి ఎన్నికల్లో దిల్ రాజు మద్దతు తెలుపుతున్న దామోదర ప్రసాద్ ప్యానల్ పై కళ్యాణ్ విరుచుకపడ్డారు. ఇప్పటి వరకు నిర్మాతల మండలికి కార్యదర్శిగా ఉన్న దామోదర ప్రసాద్ నిర్మాతల కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాఫియా బ్యాచ్ వల్ల చిత్ర పరిశ్రమ ప్రమాదంలో పడబోతుందని నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు సి.కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. రేపు నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేరుతో 27 మంది నిర్మాతలు చిత్ర పరిశ్రమను దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు.
తాను నిర్మాతల మండలిని, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ను కలిపే ప్రయత్నం చేశానని కానీ అది సఫలం కాలేదని చెప్పారు కళ్యాణ్. అధ్యక్షపదవి మోజులో కొందరు తన ప్రయత్నాలను నీరుగార్చారని ఆయన ఆరోపించారు.
నిర్మాతల మండలి ఎన్నికల్లో దిల్ రాజు మద్దతు తెలుపుతున్న దామోదర ప్రసాద్ ప్యానల్ పై కళ్యాణ్ విరుచుకపడ్డారు. ఇప్పటి వరకు నిర్మాతల మండలికి కార్యదర్శిగా ఉన్న దామోదర ప్రసాద్ నిర్మాతల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. చిన్న నిర్మాతల వల్లే సినీ పరిశ్రమ నిలబడుతుందని కానీ కొద్ది మంది పెద్ద నిర్మాతలు, గిల్డ్ మాఫియా చిత్ర పరిశ్రమను నియంత్రిస్తున్నారని ఆయన విమర్శించారు.
తాను ఈ ఎన్నికల్లో ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని అయితే నిర్మాతలు ఆలోచించి ఓటేయాలని కళ్యాణ్ కోరారు.
మరో వైపు నిర్మాతల మండలి ఎన్నికల్లో దామోదరప్రసాద్ ప్యానల్ కు ఓట్లు వేసి గెలిపించాలని నిర్మాత దిల్ రాజు నిర్మాతలను కోరారు. ఈ ప్యానెల్ లో ఉన్నది రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలే ఉన్నారని దిల్ రాజు అన్నారు.
ఒక సినిమా తీసి, ఆతర్వాత జీవితంలో సినిమా తీయని వాళ్ళే నిర్మాతల మండలి లో ఎక్కువ మంది ఉన్నారని గతంలో దిల్ రాజు ఆరోపించారు.