Telugu Global
Telangana

కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా ఖరారు.. ఇక స్క్రీనింగ్ కమిటీ చేతిలోకి

ఈ రోజు నుంచి గాంధీభవన్‌లో ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా అభ్యర్థులపై అభిప్రాయాలను సేకరించడంతో పాటు.. ఇంకా బలమైన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారనే విషయంలో కూడా సూచనలు తీసుకోనున్నారు.

కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా ఖరారు.. ఇక స్క్రీనింగ్ కమిటీ చేతిలోకి
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును వేగవంతం చేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం పీఈసీ సమావేశం గాంధీభవన్‌లో నిర్వహించారు. అధికార బీఆర్ఎస్ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కునే అభ్యర్థులను ఎంపిక చేయడానికి చర్చోపచర్చలు జరిపారు. 1000కి పైగా వచ్చిన దరఖాస్తులను 'ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ' (పీఈసీ) పరిశీలించించింది. కమిటీ సభ్యులు వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించి.. చివరకు ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఒకటి నుంచి నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రాథమిక జాబితాను ఖరారు చేశారు.

119 నియోజయవర్గాలకు గాను 1,006 మంది దరఖాస్తు చేశారు. వీరి వ్యక్తిగత నేపథ్యం, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, ఇతర అంశాలతో కూడిన వివరాలను ముందుగానే ఒక పుస్తకంలో పొందు పరిచారు. వీటిని ఆదివారం సమావేశంలో సభ్యులందరికీ అందించారు. ఇక ఆ వివరాలన్నీ చదవిన తర్వాత ఒక్కో నియోజకవర్గానికి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ వెళ్లినట్లు తెలుస్తున్నది. కొన్నింటికి ఒకరి పేరే ఖరారు చేయగా.. కొన్ని చోట్ల అత్యధికంగా నలుగురి పేర్లను ప్రతిపాదించారు. సభ్యులందరి నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు ప్రాథమిక జాబితాను ఖరారు చేసి సీల్డ్ కవర్‌లో పెట్టినట్లు తెలుస్తున్నది. దీనిని ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి పీసీఈ అందిస్తుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.

నేటి నుంచి స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు..

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నాయి. కమిటీకి మురళీధరన్ చైర్మన్‌గా ఉండగా.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జిగ్నేశ్ మేవానీ, బాబిసిద్ధికి సభ్యులుగా ఉన్నారు. ఈ రోజు నుంచి గాంధీభవన్‌లో ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా అభ్యర్థులపై అభిప్రాయాలను సేకరించడంతో పాటు.. ఇంకా బలమైన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారనే విషయంలో కూడా సూచనలు తీసుకోనున్నారు.

పీఈసీ ప్రతిపాదించిన వారిలో ఒక నియోజక వర్గంలో అందరూ బలహీనులే ఉంటే ఏం చేయాలనే విషయంపై కూడా స్క్రీనింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోనున్నది. సోమవారం అభిప్రాయ సేకరణ, మంగళవారం జిల్లా అధ్యక్షులు, సీనియర్ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇక బుధవారం స్క్రీనింగ్ కమిటీ మాత్రమే భేటీ అయ్యి.. అభ్యర్థుల ఎంపికలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఒక్కో నియోజకవర్గానికి అత్యధికంగా ముగ్గురిని మాత్రమే ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలన కోసం ఏఐసీసీకి పంపనున్నారు.

ఒక ఏదైనా నియోజకవర్గానికి కేవలం ఒకే పేరు పరిశీలన వస్తే.. ఏఐసీసీ అనుమతితో ఈ నెల 15లోపు తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆదివారం పీఈసీ సమావేశంలో పలు నియోజకవర్గాలకు ఒకే అభ్యర్థిని ఎంపిక చేశారు. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, జగిత్యాలకు జీవన్ రెడ్డి, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి (సంగారెడ్డి), భట్టి విక్రమార్క (మధిర), సంపత్ కుమార్ (ఆలంపూర్), శ్రీధర్ బాబు (మంథని), షబ్బీర్ అలీ (కామారెడ్డి), సీతక్క (ములుగు) పేర్లను సిఫార్సు చేశారు. వీరితో పాటు మరి కొంత మంది సీనియర్లు దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్కరే ఉన్నారు. వీరిందరి జాబితాను తొలి విడతలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

First Published:  4 Sept 2023 6:26 AM IST
Next Story