Telugu Global
Telangana

కేసీఆర్ కు బౌద్ధ ఉపాసక్ మహాసభ అభినందనలు..

బౌద్ధ ఉపాసక్ మహాసభ సీఎం కేసీఆర్ నిర్ణయాలను అభినందిస్తూ లేఖ రాసింది. లక్నో నుంచి సొసైటీ ప్రధాన కార్యదర్శి కేఆర్ రావత్.. సీఎం కేసీఆర్‌ కు ఒక లేఖ‌ పంపించారు.

కేసీఆర్ కు బౌద్ధ ఉపాసక్ మహాసభ అభినందనలు..
X

తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు.. అంబేద్కర్ భావజాలాన్ని విశ్వసించేవారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని అన్నారు బౌద్ధ ఉపాసక్ మహాసభ నిర్వాహకులు. ది ప్రాక్టీసింగ్ బుద్దిస్ట్ సొసైటీ (బౌద్ధ ఉపాసక్ మహాసభ) నుంచి ఈమేరకు సీఎం కేసీఆర్ ని అభినందిస్తూ ఓ లేఖ రాశారు. కోటి కోటి అభినందనలు అంటూ తమ సంతోషాన్ని వారు తెలియజేశారు.

హైదరాబాద్ లో ఇటీవలే 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నూతనంగా నిర్మించిన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది. దీంతో తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలు, దళితులు, అంబేద్కర్ సిద్ధాంతాలను ఇష్టపడేవారు.. ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కి తెలంగాణ ప్రభుత్వం అసలైన నివాళి అర్పించిందని అంటున్నారు. తాజాగా బౌద్ధ ఉపాసక్ మహాసభ కూడా కేసీఆర్ నిర్ణయాలను అభినందిస్తూ లేఖ రాసింది. లక్నో నుంచి సొసైటీ ప్రధాన కార్యదర్శి కేఆర్ రావత్.. సీఎం కేసీఆర్‌ కు ఒక లేఖ‌ పంపించారు.

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, హుస్సేన్ సాగ‌ర్ తీరాన ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం.. ఎంతో గొప్ప విషయం అని ఆ లేఖలో పేర్కొన్నారు కేఆర్ రావత్. అంబేద్కర్ భావజాలాన్ని విశ్వసించే వారికి కేసీఆర్ నిర్ణయాలు ఎంతో సంతోషాన్నిచ్చాయని చెప్పారు. ఇంత గొప్ప కార్యాన్ని చేపట్టిన మీకు, బౌద్ధ ఉపాసక్ మహాసభ కోటి కోటి అభినందనలు తెలియజేస్తున్నది అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అనునిత్యం ఇలాంటి విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టేలా, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరింతగా కృషి కొనసాగించేలా, మీకు సదా ఆయురారోగ్యాలను సుఖసంతోషాలను శక్తిని ప్రసాదించాలని, ఆ బుద్ధ‌ భగవానున్ని ప్రార్థిస్తున్నాము అంటూ లేఖను ముగించారు.

తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కూాడా అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

First Published:  29 April 2023 5:39 PM IST
Next Story