బీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలే బాస్‌లు.. చెన్నూరులో సీఎం కేసీఆర్
అందరూ ఆలోచించి బాల్క సుమన్‌కు ఓటు వేసి మరోసారి గెలిపించాలని కేసీఆర్ కోరారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన కోసమే పుట్టింది. ఈ పార్టీకి ఢిల్లీలో బాసులు ఉండరు. బీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలే బాస్‌లు. తెలంగాణ ప్రజలు ఏం కోరుతారు, వారి ఆకాంక్షలు ఏమిటమే విషయం ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవ్వాళ చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని మందమర్రిలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
ఓటు మీ తలరాతను మారుస్తుంది. ఇది ప్రజల ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. కాబట్టి డబ్బులు ఇచ్చారని, ఆషామాషీగా.. అలవోకగా ఓట్లు వేయొద్దు. ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రజా స్వామ్య దేశంలో ఓటే ప్రజల వజ్రాయుధం. మనం బాగా ఆలోచించి, పది మందితో చర్చించి నిజమేందో, అబద్ధమేంటో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత మీ ఓటును ఉపయోగించుకోవాలని సీఎం కోరారు.
బీజేపీ నుంచి ఒక వ్యక్తి అర్జెంటుగా వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఆయనకే టికెట్ కట్టబెట్టారు. అట్లనే బీజేపీ కూడా ఎవరినో ఒకరిని తెచ్చి నిలబెడుతుంది. కాబట్టి అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచించడం మంచిదని కేసీఆర్ సూచించారు. చెన్నూరు ప్రాంతం చైతన్యం ఉండే ప్రాంతం. ఇది ఉద్యమాలు జరిగిన నేల. కాబట్టి అందరూ ఆలోచించి ఉద్యమకారుడైన బాల్క సుమన్‌కు ఓటు వేసి మరోసారి గెలిపించాలని కేసీఆర్ అభ్యర్థించారు.
కాంగ్రెస్ హయాంలోనే సింగరేణి నష్టాలపాలయ్యింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణికి లాభాలు పెరిగాయి. ఉద్యోగులకు భారీగా డివిడెండ్లు, పండుగ బోనస్‌లు అందిస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామంటోంది. ధరణి తీస్తే రైతుల ఖాతాల్లో రైతు బంధు, రైతు బీమా ఎలా జమ చేస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. రైతులు మళ్లీ గోస పడ్తారు. లంచాలు ఇవ్వనిదే పని జరగని పరిస్థితికి వస్తుందని కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్‌లో టికెట్ పంచాయితీ చూస్తూనే ఉన్నాం. ఇక ఆ పార్టీకి అధికారం ఇస్తే ఇంకెంత లొల్లి జరుగుతుందో ఆలోచించండి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం ఎలా ఉన్నది.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు బేరీజు వేసుకొని ఓటు వేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.