Telugu Global
Telangana

కాంగ్రెస్ లో మునుగోడు లొల్లి!

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో ఆ పార్టీలో అసంతృప్తులు మొదలయ్యాయి. టిక్కట్ ఆశించి భంగపడ్డ‌, అసంతృప్తిగా ఉన్న కృష్ణా రెడ్డి, పల్లె రవి, కైలాశ్ నేతలు స్రవంతికి సహకరిస్తారా లేక ఆమె ఓటమికి కృషి చేస్తారా అని అనుమానాలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ లో మునుగోడు లొల్లి!
X

మునుగోడు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజినామా చేసి బీజేపీలో చేరినప్పటి నుంచి ఆ నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి ఆపార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒక వైపు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి సహాయ నిరాకరణ చేస్తుండగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, నల్గొండ కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా సరైన అవగాహన లేకపోవడంతో మునుగోడు ఎన్నిక అధిష్టానానికి తలనొప్పిగానే మారింది.

అభ్యర్థి ఎంపిక కూడా ఆ పార్టీలో గొడవలకు కారణమయ్యింది. రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావించి చలమల కృష్ణా రెడ్డి పేరును ప్రతిపాదించగా, రేవంత్ మాట చెల్లితే తమకు తిప్పలు తప్పవని భావించిన ఆ పార్టీలోని మిగతా సీనియర్లు పాల్వాయి స్రవంతి పేరును తెరమీదికి తెచ్చారు. వీళ్ళిద్దరే కాక, కైలాశ్ నేత, పల్లె రవికుమార్ ల పేర్లను కూడా పీసీసీ అధిష్టానానికి పంపగా ఏఐసీసీ పాల్వాయి స్రవంతినే ఫైనల్ చేసింది.

ఏఐసీసీ నిర్ణయంతో నిరాశ చెందిన కృష్ణా రెడ్డి ఇవ్వాళ్ళ రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు టిక్కట్ కేటాయించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయనను బుజ్జగించడానికి రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన వినడంలేదని సమాచారం. స్రవంతి గెలుపుకు కృషి చేయాలని కృష్ణా రెడ్డికి రేవంత్ చెప్పినప్పటికీ ఆయన ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కృష్ణా రెడ్డి పాల్వాయి స్రవంతి గెలుపుకు సహకరిస్తారా లేక టికట్ రాలేదన్న కోపంతో ఆమె ఓటమికి కృషి చేస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. మరో ఇద్దరు ఆశావాహులైన పల్లె రవి, కైలాశ్ నేతలు కూడా పాల్వాయి స్రవంతికి సహకరిస్తారా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది.

మరో వైపు టిక్కట్ దక్కిన పాల్వాయి స్రవంతి కూడా ఈ రోజు రేవంత్ ను కలిశారు. తనకు టిక్కట్ వచ్చేట్టు కృషి చేసినందుకు కృతఙతలు చెప్పారు.

First Published:  10 Sept 2022 1:45 PM IST
Next Story