Telugu Global
Telangana

మళ్లీ భయపెడుతున్న కడెం ప్రాజెక్టు.. గేట్లపై నుంచి పొంగుతున్న వరద

గతేడాది కూడా కడెం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చింది. అప్పుడు కూడా నాలుగు గేట్లు మొరాయించడంతో ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది.

మళ్లీ భయపెడుతున్న కడెం ప్రాజెక్టు.. గేట్లపై నుంచి పొంగుతున్న వరద
X

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ప్రాజెక్టు నీటి మట్టం 700 అడుగులు కూడా దాటిపోయింది. ప్రస్తుతం ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 14 గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరో నాలుగు గేట్లు తెరుచుకోవడానికి మొరాయించడంతో గేట్లపై నుంచి వరద నీరు పొంగి పారుతున్నది.

గతేడాది కూడా కడెం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చింది. అప్పుడు కూడా నాలుగు గేట్లు మొరాయించడంతో ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. దిగువన ఉన్న గ్రామాల ప్రజలు వరద ఉన్నన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏడాది నుంచి నాలుగు గేట్లను మరమ్మతు చేయడానికి ప్రయత్నించినా.. ఆ పనులు పూర్తి కాలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఆ నాలుగు గేట్లు తెరుచుకోకుండా.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వరద నీరు ఇదే స్థాయిలో కొనసాగితే.. పలు గ్రామాలకు ముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు.

కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం నుంచే ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిన్ననే 12 గ్రామాలను ఖాళీ చేయించారు. కడెం పరిధిలోని ఐదు గ్రామాలు, దత్తుల పరిధిలో ఏడు గ్రామాలు ఖాళీ చేయించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వం వారికి ఆహారం, నీళ్లు, పాలు అందిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పించారు.

కడెం ప్రాజెక్టు పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా రాథోడ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అధికారులను యుద్ద ప్రాతిపదికన రక్షణ, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గేట్లపై నుంచి వరద నీరు వెళ్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం వచ్చిన ప్రమాదం ఏమీ లేదని.. అనవసర వదంతులను నమ్మవద్దని మంత్రి కోరారు.

మరోవైపు మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయానికి కూడా భారీగా వరద వస్తోంది. కడెం నుంచి కూడా భారీగా వరద వస్తుండటం, గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పొంగటంతో ఎల్లంపల్లిలోకి 1.20 లక్షల క్యూసెక్కుల నీరు బుధవారం అర్థరాత్రి సమయానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146.24 మీటర్లకు చేరుకుంది. దీంతో 20 గేట్లు ఎత్తి.. దిగువకు 1.67 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


First Published:  27 July 2023 4:42 AM GMT
Next Story