Telugu Global
Telangana

తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు.. ఇండియాలోనే అత్యధికం

తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్దరణ, చెక్ డ్యాంల నిర్మాణం కారణంగా భూగర్భ నీటి లభ్యత గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 680 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు.. ఇండియాలోనే అత్యధికం
X

తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే విజయవంతం అయ్యింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ నీటి విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాల వల్ల ఇప్పుడు తెలంగాణలో నీటికి కొదువ లేకుండా పోయింది. కేవలం భూమిపైన పారే నీళ్లే కాదు.. భూగర్భ జలాలు కూడా పెరిగాయని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. కేవలం ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో సగటున 4.26 మీటర్ల పైగా భూగర్భ జలాల లభ్యత పెరిగింది. దేశంలోని మరే రాష్ట్రంలో ఇంతలా భూగర్భ జలాలు పెరగలేదని, తెలంగాణ ఈ విషయంలో అగ్రగామిగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం 680 టీఎంసీల భూగర్భ జలాలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి. 2022కు సంబంధించి 'తెలంగాణ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కంప్యూటెడ్' నివేదికను ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ విడుదల చేశారు. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్దరణ, చెక్ డ్యాంల నిర్మాణం కారణంగా భూగర్భ నీటి లభ్యత గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 680 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కృష్ణా బేసిన్‌లో మనకు ఏడాదికి కేటాయించిన నీటికి రెట్టింపు పరిమాణం. మరోవైపు రాష్ట్రంలో భూగర్భజలాల వాడకం 2020తో పోల్చితే ఈసారి 8 శాతం మేర తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. వర్షపాతం పెరగడం, అనేక ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఎక్కువ అవడం వల్ల రైతులు మోటార్ల వాడకం తగ్గించారు. సాగునీటి కాల్వలను కూడా పునరుద్దరించడంతో ఎక్కువ మంది వాటిపైనే ఆధారపడుతున్నారు. ఇక మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇంటింటికీ నల్లా పంపులు ఏర్పాటు చేయడంతో బోర్ల వాడకం తగ్గించారు. దీంతో భూగర్భ జలాల వాడకం తగ్గిపోయిందని నివేదికలో పేర్కొన్నారు.

ఇక ఈ భూగర్భ జలాల్లో వాడుకోవడానికి తీసుకోదగిన నీటి పరిమాణం కూడా పెరిగింది. 2014లో 3.5 శాతం ఉండగా.. ప్రస్తుతం 4.8 శాతానికి పెరిగినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 83 మండలాల్లో ఈ పెరుగుదల అత్యధికంగా ఉన్నట్లు వివరించారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా అనేక చెరువులను బాగు చేశారు. చెక్ డ్యాంల నిర్మాణం వల్ల వర్షపు నీటిని ఒడిసి పట్టారు. ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రోత్సహించడం కూడా భూగర్భ జలాల పెరుగుదలకు కారణమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న విలువైన భూగర్బ జలాలను సక్రమంగా ఉపయోగించుకోవడానికి తీసుకోవల్సిన చర్యలను కూడా సూచించారు. పరిశ్రమలు, వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖలతో ఓ సబ్ కమిటీని వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిఫార్సు చేశారు. ఇష్టానుసారం భూగర్భజలాలు తోడేయకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయలని తెలిపారు.

First Published:  24 Sept 2022 7:15 AM IST
Next Story